ప్రశాంతి నిలయంలో దర్పంగా సత్యసాయి సింహాసనం.. కానీ బాబా...

బుధవారం, 23 నవంబరు 2011 (21:10 IST)
WD

అదే పర్తిలోని ప్రశాంతి నిలయం. ఒకప్పుడు "మంగళనాథ దశవదనా..." అంటూ నీరాజనాలు పలుకుతూ నడయాడిన నేల నేడు బాధాతప్త హృదయాలతో భగవాన్ సత్యసాయి బాబా 86వ జన్మదిన వేడుకలను జరుపుకుంది. నవంబరు 23న బాబా జన్మదినం సందర్భంగా ప్రశాంతి నిలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దింది సత్యసాయి ట్రస్ట్.

సత్యసాయి జన్మదిన వేడుకలకు తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య, రాష్ట్రమంత్రి గీతారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే దైవాంశ సంభూతుడిగా నీరాజనాలు అందుకున్న సత్యసాయి జీవించి ఉన్నప్పుడు జన సందోహంతో కళకళలాడిన పుట్టపర్తి ఇపుడు భక్తులు లేక వెలవెలబోయినట్లు స్పష్టంగా కనిపించిది.

సాధారంగా ప్రతియేటా జరిగే సత్యసాయి జన్మదినానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా భక్తులు తరలి వచ్చేవారు. సాయిబాబా అస్తమయం తర్వాత ఇప్పుడా పరిస్థితి కనిపించలేదు. క్రిక్కిరిసిపోయే పుట్టపర్తి వీధులు బోసిపోయి కనిపించాయి. బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్ జనాలు లేక ఖాళీగా వెక్కిరించాయి.

పుట్టపర్తిలో సుమారు 350 నుంచి 400 లాడ్జీల వరకు ఉన్నాయి. బాబా జన్మదిన వేడుకల సమయంలో ఈ లాడ్జీలన్నీ భక్తులతో నిండిపోయి ఉండేవి. కానీ, ఇపుడు భక్తులు లేక లాడ్జీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అలాగే, పుట్టపర్తిలో, దాని పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా భాసిల్లేది. సాయిబాబా మరణం తర్వాత అది డీలా పడిపోయింది. 48 గజాల భూమి లక్షలాది రూపాయలు పలికేది. ఇప్పుడు వాటిని కొనే నాధుడే లేడు. ఇలా బాబా అస్తమయంతో పర్తిపై ఆ ప్రభావం తీవ్రంగానే పడింది.

వెబ్దునియా పై చదవండి