యువతకు విలువలతో కూడిన విద్య అవసరం: ప్రధాని

నేటి యువతకు విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని, ఇవి లేని పక్షంలో మనుగడ సాగించడం కష్టసాధ్యమని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ 29వ స్నాతకోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా సత్యసాయిబాబా విజయవంతంగా అమలు చేస్తున్న వివిధ పథకాలపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా, పుట్టపర్తి పరిసరాల్లో కరువు పీడిత ప్రాంతాలైన 731 గ్రామాల ప్రజలకు సాయం చేసే నిమిత్తం చేపట్టిన పనుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంచినీటి సరఫరా చేయడం పట్ల కూడా ఆనందం వ్యక్తం చేశారు.

వీటితో పాటు సమాజంలోని పేద వర్గాలకు చెందిన రోగులకు అందిస్తున్న సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల నుంచి జనరల్ హాస్పిటల్‌తో పాటు మొబైల్ మెడికల్ వాహనాల వైద్య సేవలను కొనియాడారు.

సత్యసాయి అంకితభావం వల్లే మంచినీటి సరఫరా, ఆరోగ్య పరిరక్షణ, విద్య తదితర సేవలన్నింటినీ ఉచితంగా అందజేయడంతో పాటు పౌర సమాజానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పించడం సాధ్యపడుతుందన్నారు. ఇలాంటి అంకితభావం దేశంలోని లక్షలాది మంది ప్రజలకు మార్గదర్శకంగా, ఉదాహరణంగా నిలుస్తుందన్నారు.

ఈ సందర్భంగా ఆయన సత్యసాయి ఇనిస్టిట్యూట్‌కు చెందిన విద్యార్థులను ఉత్తేజపరిచేలా ప్రధాని ప్రసంగాన్ని కొనసాగించారు. కాగా, ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య, గవర్నర్ నరసింహన్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి