సత్యసాయి ఆశ్రమాలు, మందిరాలు

సోమవారం, 17 నవంబరు 2008 (17:43 IST)
సత్యసాయిబాబా తన జన్మ స్థలమైన పుట్టపర్తిలోనే ఇప్పటికీ నివాసం ఉంటున్నారు. ఒకప్పటి ఈ చిన్న గ్రామం ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం, చైతన్యజ్యోతి అనే ఒక పెద్ద మత ప్రదర్శనశాల (దీని డిజైనుకు పలు అవార్డులు లభించాయి) ఒక ఆధ్యాత్మిక మ్యూజియమ్, ఒక రైల్వే స్టేషను, ఒక కొండ అంచు క్రీడాంగణం, విమానాశ్రయం, ఇండోర్ క్రీడాంగణం వంటి పెక్కు సదుపాయాలు ఆవిర్భవించాయి.

పుట్టపర్తి ఆశ్రమంలో భారతదేశపు ప్రముఖ నాయకులు (అబ్దుల్ కలామ్, వాజ్‌పేయి వంటివారు) అతిధులుగా వచ్చారు. సత్యసాయిబాబా 80వ జన్మదినోత్సవానికి ప్రపంచం నలుమూలలనుండి 10లక్షలమంది సందర్శకులు వచ్చారని అంచనా. ఇందులో భారత దేశం నుండీ, 180 ఇతర దేశాలనుండీ 13,000 మంది ప్రతినిధులు ఉన్నారు.

సంవత్సరంలో అధికభాగం బాబా ప్రశాంతి నిలయంలోనే గడుపుతారు. వేసవికాలం కొన్నిరోజులు బెంగళూరులోని "బృందావనం" ఆశ్రమంలో... ఎప్పుడైనా కొడైకెనాల్‌లోని "సాయి శృతి ఆశ్రమం"లో గడుపుతుంటారు.

సత్యసాయి.. ముంబైలోని "ధర్మక్షేత్రం" లేదా "సత్యం", హైదరాబాదులోని "శివం", చెన్నైలోని "సుందరం" అనే మూడు మందిరాలను నిర్మించారు. బాబా ఆశ్రమాలలో దినచర్య ఉదయం ఓంకార స్మరణ, సుప్రభాతాలతో మొదలవుతుంది. తరువాత వేద పారాయణ, సంకీర్తన, భజనలు జరుగుతాయి. బాబా దర్శనం ఇస్తాడు. ముఖ్యంగా అక్టోబరు, నవంబరు మాసాలలో బాబా ఇచ్చే దర్శనం పట్ల భక్తులకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఎందుకంటే బాబా జన్మ దినం ఈ కాలంలోనే వస్తుంది.

దర్శనం సమయంలో బాబా సందర్శకుల, భక్తుల మధ్య నడుస్తూ వారిచ్చే నమస్కారాలను, వినతి పత్రాలను స్వీకరిస్తారు. విభూదిని 'సృష్టించి' పంచుతారు. కొందరిని ప్రత్యేక దర్శనానికి, మాట్లాడడానికి అనుమతిస్తారు. ఇలా ఏకాంతంగా బాబాతో మాట్లాడి ఆయనకు తమ మనసులోని మాటను విన్నవించుకోవడం భక్తులకు ఎంతో సంతోష కారణంగా ఉంటుంది. అటువంటి దర్శన సమయాలలో బాబా భక్తుల మనసులోని మాటలను, ఇతర అనూహ్యమైన విషయాలను వెల్లడిస్తుంటారని, అలా భక్తులు ఆశ్చర్యపడుతారని అంటుంటారు. అయితే, తన దర్శనం ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రసాదిస్తుందని మాత్రమే బాబా చెబుతాడు.

"నా దర్శనం తరువాత ప్రశాంతంగా, ఏకాంతంగా కూర్చొనండి. ఆ ప్రశాంతతలో నా ఆశీర్వాదం సంపూర్ణంగా మీకు లభిస్తుంది. మీ ప్రక్కనుండి నేను నడచినపుడు నా శక్తి మిమ్ములను చేరుతుంది. వెంటనే గనుక మీరు ఇతరులతో మాట్లాడడం మొదలుపెడితే ఆ శక్తి మీకు ఉపయోగం కాకుండా చెల్లాచెదరు కావచ్చును. నా కంటపడిందేదైనా నిస్సంశయంగా చైతన్యవంతమౌతుంది. రోజు రోజుకూ మీలో మార్పులు సంభవిస్తాయి. మీ మధ్యలో నడవడం అనేది దేవతలు సైతం కోరుకొనే సుకృతం. అది నిరంతరం ఇక్కడ మీకు లభిస్తున్నది. అందుకు కృతజ్ఞులు కండి." అని సత్యసాయి తరచూ తన భక్తులకు ఉద్భోదిస్తుంటారు.

వెబ్దునియా పై చదవండి