సత్యసాయి జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు

సోమవారం, 25 ఏప్రియల్ 2011 (17:49 IST)
PR
86 సంవత్సరాల సత్యసాయి జీవితంలో అనేక మధుర ఘట్టాలు నిక్షిప్తమై ఉన్నాయి. అలాగే ఎన్నో విమర్శలు, ఆరోపణలూ లేకపోలేదు. అయితే, సాయి జనన సంవత్సరం 1926 నుంచి మరణమైన 2011 వరకు చోటు చేసుకున్న కొన్ని ముఖ్య ఘట్టాలను ఒకసారి పరిశీలిస్తే..

1926లో సత్యసాయి జననం. 1940లో సత్యసాయి అంటే 14వ యేట తనను తాను సాయిబాబాగా ప్రకటించుకున్నారు. 1941లో తన భవిష్యత్ వాణిని వెల్లడించారు. 1945 అక్టోబరు 25వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌లో తొలిసారి తన బహిరంగ వాణిని వినిపించారు. అక్కడ భక్తుల నుంచి చిట్టీల ద్వారా వచ్చిన భక్తుల సందేహాలకు, ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఆరంభించారు. ఇది చివరకు కొనసాగించారు.

1948లో లాటిన్ అమెరికా దేశాల్లో సత్యసాయి వాణి వ్యాప్తికి తొలిబీజం పడింది. 1950లో అంటే తన 25వ జన్మదినం సందర్భంగా నవంబరు 23వ తేదీన ప్రశాంతి మందిరం ఏర్పాటైంది. ఆ పునాది రాయి ఏ ముర్తానా పడిందో ఏమో తెలియదు గానీ.. ప్రశాంతి నిలయం మాత్రం ప్రపంచంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ఖ్యాతిగడించింది.

1956లో సత్యసాయి జనరల్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. 1957లో దేశంలో బ్రిటీష్ పాలన ముగిసిన తర్వాత భారతీయ సనాతన ధర్మ ప్రచారంపై జరిగిన 9వ అఖిలభారత ఆధ్యాత్మిక సదస్సులో సాయిబాబా ప్రసంగించారు. 1960లో బాబా జీవితంపై సత్యం శివం సుందరం పేరుతో పుస్తకం తొలి సంపుటి విడుదలైంది.

1962లో బాబా తొలి విదేశీ పర్యటన. పనామాను సందర్శించిన ఆయన అక్కడ సాయి కేంద్రాన్ని ప్రారంభించారు. 1966లో బాల వికాన్ పాఠశాలను నెలకొల్పారు. 1968లో ప్రపంచ మహాసభల నిర్వహణ, అనంతపురంలో బాలికల కళాశాలను ఏర్పాటు చేశారు. 1970లో సాయి సందేశాలు, రచనలు, మహిమలు ప్రపంచ వ్యాప్తి చెందాయి. 1971లో కాలిఫోర్నియా సహా అమెరికాలోని పలు ప్రాంతాల్లో సాయి కేంద్రాలు ప్రారంభమయ్యాయి.

1975లో బెంగుళూరులో సత్యసాయి కళాశాల ఏర్పాటు, 1981లో డీమ్డ్ యూనివర్శిటీ స్థాపన. 1990లో పుట్టపర్తిలో విమానాశ్రయ నిర్మాణం, 1990లో మ్యూజియం ఏర్పాటు. 1992లో 300 కోట్ల రూపాయల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి స్థాపన. 1995లో అనంతపురం జిల్లా దాహార్తిని తీర్చేందుకు 350 కోట్లతో సత్యసాయి తాగునీటి పథకం ప్రారంభం.

1997లో హిల్ వ్యూ స్టేడియం నిర్మాణం. 2000లో ప్రశాంతి నిలయం పేరుతో రైల్వే స్టేషన్ ప్రారంభం. 2001లో 500 కోట్ల రూపాయల వ్యయంతో బెంగుళూరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు. 2011 ఏప్రిల్ 24వ తేదీన సత్యసాయి మహాప్రస్థానం.

వెబ్దునియా పై చదవండి