సత్యసాయి మహిమలు

సోమవారం, 17 నవంబరు 2008 (17:55 IST)
బాబా మహిమల గురించి అనేకమైన నమ్మకాలు, వివాదాలు ఉన్నాయి. కొన్ని పుస్తకాలలోనూ, పత్రికా రచనలలోనూ, ఇంటర్వ్యూలలోనూ బాబా అనుచరులు బాబా మహిమల గురించీ, వ్యాధి నివారణా శక్తిని గురించీ తరచు ప్రస్తావించారు. కొన్నిసార్లు భక్తుల అనారోగ్యాన్ని బాబా తాను గ్రహించినట్లుగా చెప్పబడుతున్నది. అనునిత్యం బాబా విభూతిని, కొన్ని మార్లు ఉంగరాలు, హారాలు, వాచీల వంటి చిన్న వస్తువులనూ "సృష్టించి" భక్తులకు పంచిపెడతాడని చెబుతారు.

ప్రపంచ వ్యాప్తంగా భక్తుల ఇళ్ళలో బాబా పటాలు, పూజా మందిరాలు, విగ్రహాలు, పీఠాలనుండి విభూతి, కుంకుమ, పసుపు, పవిత్ర తీర్ధజలం, శివలింగాలు, చిన్న సైజు (ఇత్తడి, బంగారం) దేవతా మూర్తులు, ప్రసాదాలు (తినుబండారాలు), విలువైన మణులు, దారాలు వంటివి లభించడం జరుగుతున్నట్లు గురించి అనేక కధనాలున్నాయి.

కిర్లియన్ ఫొటోగ్రఫీ ద్వారా కాంతి పుంజాలను పరిశీలించి, విశ్లేషించడంలో నిపుణుడైనఫ్రాంక్ బారొవస్కీ బాబా కాంతిపుంజాన్ని పరిశీలించి చెప్పిన అభిప్రాయం - అంతకుముందు తాను పరిశీలించిన ఎవరి కాంతిపుంజాలూ బాబా కాంతి పుంజాలలా లేవు. బాబా సామాన్యమైన వ్యక్తి కాదు. దివ్యపురుషుడై ఉండాలి. బాబా కాంతిపుంజం చాలా విశాలమై దిగంతాలకు వ్యాపిస్తున్నది. ఇంతకు ముందెన్నడూ చూడని బంగారు, వెండి (రంగు) ఛాయలు అందులో కనిపిస్తున్నాయని చెప్పడం గమనార్హం.

ఐస్లాండ్కు చెందిన మనో విజ్ఞాన శాస్త్రవేత్త ఎర్లెండర్ హెరాల్ద్ సన్ 'నియంత్రిత పరిస్థితులలో' బాబాను అధ్యయనం చేయడానికి ప్రయత్నించాడు కాని అందుకు అనుమతి లభించలేదు. అయినా ఆ శాస్త్రవేత్త బాబా మహిమలగురించి విస్తృతంగా ఇతరులను ఇంటర్వ్యూ చేసి అధ్యయనం చేసి తన పరిశోధనలను ప్రచురించాడు.

భక్తులనూ, పూర్వ భక్తులనూ ఇంటర్వ్యూ చేయడం ద్వారా అతనికి అనేక అసాధారణ విషయాలు తెలియవచ్చాయి. బాబా గాలిలో తేలిపోవడం, ఒకచోటనుండి మరోచోట ప్రత్యక్షం కావడం, అదృశ్యం కావడం, రాతిని మిఠాయిగా మార్చడం, నీటిని మరో పానీయం లేదా పెట్రోలుగా మార్చడం, అడిగిన వస్తువులు సృష్టించి ఇవ్వడం, తన దుస్తుల రంగు ఒక్కసారిగా మార్చడం, వ్యాధి నివారణ, కొంత ఆహారాన్ని అధికంగా చేయడం, అనూహ్య దృశ్యాలు, స్వప్నాలు, ఒక చెట్టుపై మరొక కాయలు కాయించడం, ప్రకృతిని నియంత్రించడం, వివిధ దేవతా మూర్తులుగా దర్శనమివ్వడం, తేజోవంతమైన కాంతిని వెదజల్లడం లాంటి మహిమలు తమ స్వానుభవంగా కొందరు భక్తులు చెప్పారు.

ఈ విధమైన ఘటనలు దివ్య కార్యాలని బాబా చెప్పాడు కాని వాటిని గురించి శాస్త్రీయమైన ప్రయోగ పరిశోధనలు చేయాలన్న శాస్త్రజ్ఞుల కోరికలను తిరస్కరించాడు. "ఇంద్రియాలకు లోబడేది విజ్ఞాన శాస్త్రం. అతీంద్రియమైనది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మిక సాధన ద్వారానే దానిని తెలుసుకోవచ్చును. విశ్వంలో అద్భుతాలలో కొద్ది విషయాలను మాత్రమే విజ్ఞానశాస్త్ర్రం వెలిబుచ్చగలిగింది" అని బాబా అన్నాడు.

వెబ్దునియా పై చదవండి