సత్యసాయి సేవలు ప్రపంచానికి అవసరం: రతన్ టాటా

PR
పుట్టపర్తిలో నవంబర్ 17 ఓ మంగళప్రదమైన రోజుగా మారింది. ఆ రోజున ఇక్కడ 85 జంటలు ఒకటయ్యాయి. వీరంతా వివాహమనే మూడుముళ్ల బంధంతో తమ రెండు జీవితాలను ఒక్క తాటిపై నడిపించేదుకు శ్రీ సత్యసాయి బాబా సన్నిధి చేరుకుని స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందారు.

శ్రీ సత్యసాయి బాబా 85వ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ఈ సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సంధర్భంగా 85 జంటలు వారి వారి భాగస్వాములతో ముడిపడి స్వామి వారి ఆశీస్సులను పొందారు. పుట్టపర్తిలో నవంబర్ 23న శ్రీ సత్య సాయి బాబా జన్మదినోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో భాగంగానే సెంట్రల్ ట్రస్ట్ ఈ హమత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌ను 1972లో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఓ ప్రజా సేవా సంస్థగా స్థాపించారు. ఆశ్రమాలను నిర్వహించడం, విద్యా, వైద్య రంగాలలో సామాజిక సేవచేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత మంచినీటి సరఫరా ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ వంటి పలు సామాజిక సేవా కార్యక్రమాలకు ఈ సంస్థ బాధ్యత వహిస్తుంది. ప్రతివ్యక్తికి కావలసిన త్రాగునీరు, ఔషధాలు, విద్య వంటి ప్రాథమిక అవసరాలు ఈ సేవా సంస్థలో ఉచితంగా లభిస్తాయి.

"శ్రీ సత్యసాయి బాబా నిజంగా ఒక గొప్ప మానవమూర్తి. సాయి ట్రస్ట్ అందిస్తున్న సాయి యూనివర్సిటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ వంటి సేవలు ఎక్కువగా ఆకట్టుకున్నాయి. ఇక్కడి సిబ్బంది వృత్తి తత్వంలో ఉన్న నాణ్యత ప్రశంసించదగినది. స్వామి దృష్టికి, సావధానతకు ఈ ఇనిస్టిట్యూషన్లు నిలువెత్తు నిదర్శనలు. అతని సేవలు, ప్రేమ ఈ ప్రపంచానికి ఎంతో అవసరమ"ని ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రతన్ టాటా వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి