సత్యసాయిని సైతం వదలని ప్రశంసలు... విమర్శలూ..!

సోమవారం, 17 నవంబరు 2008 (18:08 IST)
ఆయన చేయి చాపితే చాలు.... శివలింగం ప్రత్యక్షం. అంతర్జాతీయ ఆధ్యాత్మిక నేతగా భక్తుల నీరాజనాలందుకుంటున్న ఆయన... చిటికె వేస్తే చాలు విభూది రాలుతుంది. ఆయనే శ్రీ సత్యసాయిబాబా. భక్తుల బాధలను స్వీకరించి వారి ఈతిబాధలను తీర్చే భగవత్‌ స్వరూపునిగా బాబాను నమ్మినవారు త్రికరణ శుద్ధిగా చెప్తుంటారు. మానవాతీతమైన అద్భుతాలకు ప్రశాంతి నిలయం ప్రపంచవ్యాప్తంగా పేరొందడానికి సత్యసాయిబాబానే కారణమని తెలుపుతుంటారు.

విభూతి, తినుబండారాలు, బంగారపుటుంగరాలు, స్వర్ణశోభితమైన కంఠహారాలు ఇత్యాది వాటిలో ఏదో ఒకదానిని కరకమలాల నుంచి సృష్టించి బాబా భక్తులకు అందిస్తుంటారు. ప్రతిరోజూ తన దర్శనార్థం విచ్చేసే భక్తులకు పైన పేర్కొన్న వస్తువుల్లో ఏదో ఒకదానిని ప్రసాదంగా ఇవ్వడం బాబా దినచర్యలో ఒక భాగమని భక్తులు చెప్పుకుంటుంటారు.

అయితే ఈ అద్భుతాలను సృష్టించడం దైవిక శక్తిలో ఒక భాగమని సత్యసాయిబాబా వివరిస్తుంటారు. కానీ తన అద్భుతాలను శాస్త్రీయమైన కోణంలో పరిశోధించేందుకు ఆయన సుతరామూ అంగీకరించరని హేతువాదులు ఆరోపిస్తుంటారు. హస్తలాఘవంతోనే బాబా వస్తువులను సృష్టిస్తుంటారని విమర్శకులు చెప్తుంటారు. బాబా మహత్మ్యాల వెనుక ఆరోపణలను కొన్ని భారతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించిన వైనాన్ని విమర్శకులు ప్రధానంగా ప్రస్తావిస్తుంటారు.

భారత స్వర్ణ నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ బాబా స్వర్ణాభరణాలను సృష్టిస్తున్నారంటూ కొందరు వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే వారి కేసును న్యాయస్థానం కొట్టివేసింది. కానీ న్యాయపరిధిలో ఆధ్మాత్మిక శక్తిని డిఫెన్స్‌గా గుర్తించకూడదనే ప్రాతిపదికన వారు అప్పీలు చేసుకున్నారు. సత్యసాయిబాబా అద్భుతాలు అనగా నోటి నుంచి శివలింగాన్ని సృష్టించడం తదితరాలను అదేరకంగా చేసి చూపే రహస్య స్వామి డాక్యుమెంటరీని సైతం వారు ప్రదర్శించారు. సత్యసాయిబాబాకు మానవాతీత శక్తులు ఉన్నాయంటూ ఆయన విమర్శకులు కూడా విశ్వసిస్తున్న అంశాన్ని వారు నివేదించారు.

ఇవే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఘటనలు బాబా వ్యక్తిత్వాన్ని గురించి, అతని సంస్థల గురించిన సంచలనాత్మకమైన విమర్శలకు కారణమయ్యాయి. జూన్ 6, 1993న నలుగురు వ్యక్తులు చాకులతో సాయిబాబా గదిలోకి దూరారు. ఇద్దరు అనుచరులను చంపారు. ఆ నలుగురు ఆగంతకులూ చంపబడ్డారు. ఇది వార్తా పత్రిలలో ప్రముఖంగా వచ్చింది. తన 1993 గురు పూర్ణిమ ఉపన్యాసంలో బాబా 'తన అనుయాయుల మధ్య ఉన్న అసూయ ఈ ఘటనకు కారణం' అని బాబా చెప్పాడు కాని అంతకంటే వ్యాఖ్యానించలేదు. నలుగురు ఆగంతుకులనూ అక్కడే చంపవలసిన అవసరం ఉందా అన్న విషయంపై కూడా పలు వాదోపవాదాలు జరిగాయి.

ఇక అతి ముఖ్యమైన సంఘటన 2007 సంవత్సరం అక్టోబర్ మాసంలో చోటు చేసుకుంది. ఆ సమయంలో పుట్టపర్తిలో స్థానికంగా గల విమానాశ్రయం వద్ద విశ్వరూప దర్శనం అనగా చంద్రునిలో కనిపిస్తానని ప్రకటించినట్లు వార్తలు వెలువడినాయి. భక్తులు భారీ సంఖ్యలో విమానాశ్రయం సమీపానికి చేరుకున్నారు.

అయితే చందమామను మేఘాలు ఆవరించడంతో ఆ అద్భుతం ఆవిష్కృతం కాలేదు. తిరిగి ప్రశాంతినిలయం చేరుకోవడానికి బాబా గంటకుపైగా వేచి ఉండవలసిన పరిస్థితి తలెత్తింది. నిరాశచెందిన ప్రజాసమూహాన్ని చెదరగొట్టేందుకు పోలీసు అధికారులు నానా తంటాలు పడవలసి వచ్చింది. అద్భుతం జరగకపోవడంపై సత్యసాయి ట్రస్ట్ ఎటువంటి వివరణను ఇచ్చుకోలేదు. సత్యసాయిబాబా కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసేందుకే ఈ తరహా ప్రచారం జరిగిందని బాబా భక్తులు పేర్కొన్నారు.

ఇంకా ప్రైవేటుగా తనను సందర్శించ వచ్చిన వారి పట్ల సాయిబాబా లైంగిక ప్రవర్తన గురించిన 'ఫిర్యాదులు' కూడా తరచూ వివాదాస్పదం అయ్యాయి.ముఖ్యంగా పాశ్చాత్య దేశాల పత్రికలలోనూ, టివి ఛానళ్ళలోనూ ఈ విషయమై విమర్శనాత్మకమైన కధనాలు వెలువడ్డాయి. ఈ కధనాల గురించిన స్పందనలు కూడా తీవ్రంగానే వచ్చాయి.

సాధారణంగా ఇటువంటి విమర్శలకు సాయిబాబా స్పందించడం జరుగలేదు. కాని 2000లో ఒక ఉపన్యాసంలో 'కొందరు ధన ప్రలోభాలకు లోబడి ఇటువంటి అపనిందలు వేస్తున్నారు' అని చెప్పారు. పుట్టపర్తి ఆశ్రమం సెక్రటరీ కె.చక్రవర్తి ఇటువంటి నిందలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాడు. మహా పురుషుల జీవితాలలో వివాదాలు రాకపోలేదనీ, ఇదంతా బాబా లీల అనీ, వివాదాలు వచ్చినా బాబా పట్ల ఆరాధన పెరుగుతూనే ఉన్నదనీ బాబా అనువాదకుడు కుమార్ అన్నాడు.

వెబ్దునియా పై చదవండి