సదానంద గౌడ రైల్వే బడ్జెట్ 2014-15 హైలెట్స్.. న్యూ ట్రైన్స్...
మంగళవారం, 8 జులై 2014 (15:03 IST)
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ లోక్‌సభలో రైల్వే బడ్జెట్ 2014-15ను ప్రవేశపెట్టారు. రైల్వే ప్రయాణికుల భద్రతే తమ ప్రధానాంశమన్నారు. సరుకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామిగా నిలవడమే లక్ష్యమన్నారు. సరుకు రవాణాలో చైనా, రష్యాలాంటి దేశాల తర్వాత తామే ఉన్నామని చెప్పారు. ఇటీవల పెంచిన రైల్వే చార్జీల వల్ల రైల్వే శాఖకు రూ.8 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ యేడాది మొత్తంగా రూ. 602 కోట్లు మిగులు ఆదాయమే తమ లక్ష్యమని ప్రకటించారు.
ఇదిలావుండగా, లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో కొత్తగా ఐదు జనసాధారణ్, 5 ప్రీమియం, 27 ఎక్స్‌ప్రెస్, 6 ఏసీ, 8 ప్యాసింజర్, రెండు మెమో, ఐదు డెమో రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు కేంద్రమంత్రి సదానందగౌడ లోక్ సభలో ప్రకటించారు. అయితే, ఉమ్మడి రాజధాని హైదరాబాదుకు రెండు సెమీ బులెట్ రైళ్లను మంత్రి ప్రకటించారు. ఇందులో ఒక రైలు చెన్నై-హైదరాబాద్ మధ్య, రెండో రైలు విజయవాడ-హైదరాబాదు మధ్య సెమీ బులెట్ రైళ్లు వేస్తున్నట్టు తెలిపారు. ఇంకా బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
*ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.20,680 కోట్లు అవసరం
* విజయవాడ - ఢిల్లీ మధ్య ఏసీ ఎక్స్‌ప్రెస్ కొత్తరైలు.
* విశాఖ-చెన్నై మధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్
* సికింద్రాబాద్-నిజాముద్దీన్ మధ్య ప్రీమియం రైలు
* ముంబై-గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్
* ముంబై - అహ్మదాబాద్ మధ్య తొలి బులెట్ ట్రయిన్.
* చార్‌థామ్, కేదారనాథ్, బద్రీనాథ్‌లకు రైల్వే కనెక్టివిటీ.
* కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రైల్వేలైన్ల అనుసంధానం.
* నాగపూర్-సికింద్రాబాద్ మధ్య సెమీ బులెట్ రైలు కేటాయించినట్టు చెప్పారు
* పారాదీప్-విశాఖపట్నం వీక్లీ ఎక్స్ ప్రెస్
* త్వరలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు
* ఈశాన్య రాష్ట్రాలకు ఏకో టూరిజం రైళ్లు, ఎడ్యుకేషన్ రైళ్లు
* 2014-15 ఆదాయం అంచనా రూ. 1,64,000 కోట్లు.
* ఛార్జీల పెంపుతో రూ. 8 వేల కోట్ల ఆదాయం
* అన్ని ప్రధాన స్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు.
* వృద్ధులు, వికలాంగుల కోసం రైల్వే స్టేషన్లలో బ్యాటరీ వాహనాలు.
* స్టేషన్లలో శుభ్రతను పరిశీలించేందుకు సీసీటీవీలు.
* ప్రధాన రైళ్లలో ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సౌకర్యాలు.
* కోచ్, రైలును కూడా బుక్ చేసుకునే అవకాశం.
* డబ్లింగ్, ట్రిప్లింగ్ లకు మొదటి ప్రాధాన్యత.
* కొత్త రైల్వే లైన్లకు రెండో ప్రాధాన్యత.
* ప్రైవేటు భాగస్వామ్యంతో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత.
* 50 మేజర్ స్టేషన్లలో ఔట్ సోర్సింగ్ విధానంలో పారిశుధ్యత కార్యక్రమాలు.
* ఆర్పీఎఫ్ సిబ్బందికి మొబైల్ ఫోన్లు.
* రైల్వే సిబ్బంది సంక్షేమ నిధి రూ.500 కోట్ల నుంచి రూ.800 కోట్లకు పెంపు.
* త్వరలోనే ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు.
* రూ.100 కోట్లతో ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ నెట్ వర్క్
* భద్రత కోసం త్వరలోనే 17000 ఆర్పీఎఫ్ సిబ్బంది.
* కాపలాలేని 5400 రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల మూసివేత.
* రైళ్లలో మహిళల భద్రత కోసం 4 వేల మంది మహిళా కానిస్టేబుళ్ల నియామకం.
* రైల్వే యూనివర్శిటీ స్థాపన
* ఆన్లైన్ ద్వారా ప్రయాణ, ప్లాట్ ఫాం టికెట్ల విక్రయం.
* పోస్టాఫీసుల్లో రైల్వే రిజర్వేషన్ సౌకర్యం
* ఐదేళ్లలో పేపర్ లెస్ కార్యాలయాలు.
* పార్కింగ్, ప్లాట్ ఫాం కాంబో టికెట్ల విక్రయాలు.
* విమానాశ్రయాల స్థాయిలో ప్రధాన రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ.
* ఎంపిక చేసిన రూట్లలో రైళ్ల వేగం గంటకు 160-200 కి.మీటరకు పెంపు.
* 10 మెట్రో స్టేషన్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాం.