కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన, పవిత్రమైన మాసం. ఈ మాసంలో గంగా, గోదావరి, కృష్ణ వంటి నదలను తలచుకుంటూ స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి స్వామికి అభిషేకాలు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా కార్తీక పురాణం పారాయణం చేయాలి. ఈ మాసంలో తులసి మాలను ధరించుకుని వైష్ణవ ఆలయాలను దర్శించుకోవాలి.
శివునికి లక్ష బిల్వార్చన, విష్ణుమూర్తికి లక్ష తులసి పూజ, అమ్మవారికి లక్ష పుష్పార్చన చేయించడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి నక్షత్ర దర్శనం తరువాత భగవంతునికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఆహారంగా తీసుకోవాలి. పనస ఆకుల్లో భోజనం చేయడం శ్రేష్ణమని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెబుతున్నారు.
ఉసిరికాయ చెట్టు చుట్టూ 9 సార్లు ప్రదక్షణలు చేసి సహపంక్తి భోజనాలు చేయడం వలన, ఆలయాలలో దీపాలు వెలిగించడం వలన, దీపదానాలు చేయడం వలన, దానధర్మాలు చేయడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చును. ఈ కార్తీక మాసంలో ఉల్లి, నీరుల్లి, చద్ది అన్నం, మాంసం, మద్యం, వంకాయ వంటి పదార్థాలను తీసుకోకూడదు.