శ్రీకాళహస్తి దేవాలయంలో నెయ్యి కొనుగోలు.. నిబంధనలకు తూట్లు

మంగళవారం, 25 అక్టోబరు 2016 (14:41 IST)
శ్రీకాళహస్తి దేవస్థానంలో టెండర్లతో నిమిత్తం లేకుండా నెలల తరబడి ప్రైవేట్‌గా నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. అక్రమ వ్యవహారం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి పన్ను ఎగ్గొట్టడానికి దేవస్థానమే తమ వంతు సహకారం అందిస్తుండటం గమనార్హం. ఇంతకీ విషయం ఏమంటే...
 
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రసాదాల తయారీ కోసం ప్రతినెలా 9 టన్నుల నెయ్యి ఉపయోగిస్తారు. సాధారణంగా టెండర్లు పిలిచి, తక్కువ ధర కోట్‌ చేసిన వారి నుంచి నెయ్యి కొనుగోలు చేస్తుంటారు. టెండర్లు పిలవడంతో ఏదైనా ఇబ్బందులు తలెత్తినపుడు 15 రోజుల నుంచి 30 రోజులకు అవసరమయ్యే నెయ్యిని అత్యవసర కొనుగోలు కింద ఎవరి వద్దనైనా కొనుగోలు చేయవచ్చు. అయితే శ్రీకాళహస్తి దేవస్థానంలో 10 నెలలుగా టెండర్లు లేకుండానే నెయ్యి కొంటున్నారు. 
 
గత యేడాది డిసెంబర్‌ ఆఖరికి అప్పటిదాకా నెయ్యి సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌ గడువు ముగిసింది. అప్పటిదాకా కిలో 366 రూపాయల వంతున కొనుగోలు చేశారు. టెండర్లు పిలిచారు. అందరూ కాస్త ఎక్కువ ధర కోట్‌ చేశారు. సాధారణంగా ఈ టెండర్‌ దారులనే పిలిచి ధర తగ్గించమని బేరమాడవచ్చు. దీన్నే నెగోసియేషన్‌ అంటారు. అయితే టెండరు కూడా వేయని తిరుమల డెయిరీ పిలిచి నెగోసియేషన్‌ చేశారు. టెండర్లలో పాల్గొనని వారితో నెగోసియేషన్‌ చేయడం విరుద్ధం. అయినా ఆ డెయిరీ నుంచే కిలో 368 వంతున కొనుగోలు చేశారు. మూడు నెలల పాటు ఆ ధరకు నెయ్యి సరఫరా చేసిన తిరుమల డెయిరీ ఆ తర్వాత ధర పెంచాల్సిందేనని పట్టుబట్టింది.
 
దీంతో విశాఖ డెయిరీతో చర్చలు జరిపి కిలో 375 రూపాయల వంతున కొనుగోలు చేస్తూ వచ్చారు. మూడు నెలల విశాఖ డెయిరీ నుంచి నెయ్యి వచ్చింది. అదీ 10 రోజులు ముందుగా అడ్వాన్స్ ఇచ్చి నెయ్యి తెచ్చుకున్నారు. ఇలా అడ్వాన్సు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. ఆ తర్వాత ఆ డెయిరీ కూడా ధర పెంచాలని కోరడంతో మళ్ళీ తిరుమల డెయిరీని ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ డెయిరీ 385 వంతున సరఫరా చేస్తోంది. నెలకు 30 లక్షలకుపైగా బిల్లు అవుతోంది.
 
నెయ్యి కొనుగోలుకు టెండర్‌ పిలవడంలో ఉన్న ఇబ్బంది ఏమిటో తెలియదు. ఎంత తక్కువ ధరకు కొనుగోలు చేసినా టెండర్లు లేకుండా కొనడానికి నిబంధనలు అంగీకరించవు. దీనివల్ల పారదర్శకత లోపించి అక్రమాలు జరిగే అవకాశముంటుంది. 10 నెలలుగా నిబంధనలు ఉల్లంఘించి నెయ్యి కొనుగోలు చేస్తున్నా దేవదాయ శాఖ ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడం లేదు. 
 
ప్రస్తుతం శ్రీకాళహస్తి ఆలయానికి నెయ్యి సరఫరా చేస్తున్న డెయిరీ తమిళనాడు బిల్లులు సమర్పిస్తున్నట్లు సమాచారం. ఆ బిల్లులను ఆలయ అధికారులు తిరస్కరించాలి. నెయ్యిని చెన్నై నుంచి కొనుగోలు చేసినా ఆంధ్రప్రదేశ్‌లో చెల్లించాల్సిన పన్ను తాలూకూ బిల్లులు సమర్పించాలి. అప్పుడే బిల్లులు చెల్లించడానికి అవకాశముంటుంది. నెలకు 30 లక్షల నేతిని ఆలయం కొనుగోలు చేస్తుంది. దీనిపైన 14.5 శాతం వాట్‌ను సంబంధిత డెయిరీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే నెలకు 4.35 లక్షల ఆదాయం ప్రభుత్వం కోల్పోతుందన్నమాట. గతంలో కాణిపాకం ఆలయం ఇదేవిధంగా నందిని డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంది. ఆఖరికి ఆ డెయిరీ బిల్లుల నుంచి 660 లక్షలు కట్‌ చేసింది. ఇప్పటికీ 18 లక్షల బిల్లు పెండింగ్‌లో ఉంది.
 
ఆలయంలో అధికారులు నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా పాలకమండలి కూడా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ధర్మకర్తల మండలి ఉన్నదే ఇలాంటి వాటిని అరికట్టానికే. మరి 10 నెలలుగా నెయ్యి టెండర్లు పిలవకున్నా పాలకమండలి ఏమీ చేస్తున్నట్లు. టెండర్లు పిలవమని ఈఓను ఆదేశించారా? ఈవో బోర్డు మాట ఖాతరు చేయకుంటే దేవదాయశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారా. ఇప్పటికే అడ్డగగోలు పద్ధతులకు స్వస్తి చెప్పాలి. ఇది సొంత వ్యవహారం కాదు. ప్రతిదానికి నిబంధనలు ఉంటాయి. వాటిని ఎవరైనా పాటించాల్సిందే. అధికారుల పనితీరుకు ఇదే గీటురాయి. 

వెబ్దునియా పై చదవండి