మూలవిరాట్ గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడుతారో తెలుసా?

మంగళవారం, 10 జులై 2018 (11:05 IST)
ఏడుకొండలవాడు, ఆశ్రిత వత్సలుడు, కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి మూలవిరాట్టును గడ్డం కింద నిత్యం పచ్చకర్పూరంతో అలంకరిస్తారు. ఎందుకంటే దీని వెనుక ఓ వృత్తాతం ఉంది. స్వామి అలంకరణ కోసం పుష్పనందన వనాన్ని పెంచాలని రామానుజార్యులవారు తన శిష్యుడు అనంతాళ్వార్‌ను ఆదేశించారు. ఈ పనిలో అనంతాళ్వార్ సతీమణి కూడా పాలుపంచుకుంది.
 
గర్భవతిగా ఉన్న ఆమె తవ్విన మట్టిని గంపలో తీసుకెళుతూ అలసి కింద పడిపోతుంది. దీన్ని గుర్తించిన శ్రీనివాసుడు బాలుని రూపంలో ఆమెకు సాయపడుతారు. దైవకార్యంలో ఇతరులెవరూ జోక్యం చేసుకోకూడదంటూ ఆ బాలుడిని అనంతాళ్వార్ కొడతాడు. గడ్డంపై దెబ్బ తగలడంతో బాలుడు అదృశ్యమైపోతాడు.
 
ఆ తరువాత అనంతాళ్వార్ ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుంటాడు. గడ్డంపై నుండి రక్తం కారడం చూసిన అనంతాళ్వార్ ఆ బాలుడు శ్రీహరేనని గ్రహించి రక్తం కారకుండా పచ్చకర్పూరం పెడతాడు. అందుకే నేటికీ మూలవిరాట్ గడ్డం కింద పచ్చకర్పూరం పెడుతున్నారు. భగవంతుడు భక్తుల కోసం పడరాని పాట్లు పడ్డారు, పడుతుంటారు. తన్నులు, తాపులు తిన్నాడు. భక్తి ప్రేమపాశానికి బద్ధుడై పూదోటలో బందీగా ఉన్నాడు. భక్తులు చేయవలసినదల్లా భగవంతుణ్ని మనస్పూర్తిగా ప్రేమించడమే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు