భారతదేశంలో కొన్ని ప్రఖ్యాత ఆలయాల్లోకి స్త్రీలను అనుమతించరని తెలిసిందే. శబరిమల, శని సిగ్నాపూర్ ఆలయంలోని శని శిల వద్దకు మహిళలను రానివ్వరు. ఈ ఆచారాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడవటం, కోర్టు ఇందులో జోక్యం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ మన దేశంలో మగవారికి ప్రవేశంలేని దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మ సృష్టికర్త. మనందరి తలరాతలు వ్రాసేది ఈయనే. కానీ బ్రహ్మకు ఎక్కడా గుళ్లు గోపురాలు ఉండవు, పూజలు, యజ్ఞాలు, యాగాలు నిర్వహించరు. అయితే, రాజస్థాన్‌లోని పుష్కర్‍లో మాత్రమే బ్రహ్మ ఆలయం ఉంది. కానీ అక్కడ మగవారికి ప్రవేశం లేదు. దానికి కారణం పూర్వం బ్రహ్మ ఓ యజ్ఞం చేశాడట. యాగానికి భార్య పక్కనుండాలి. కానీ సరస్వతీ దేవి రావడం ఆలస్యమవడంతో గాయత్రీ దేవిని వివాహం చేసుకున్నాడట. దానికి కోపించిన సరస్వతీదేవి శాపం పెట్టిందట, అప్పటి నుండి ఆ ఆలయంలోకి స్త్రీలు మాత్రమే ప్రవేశిస్తున్నారు.
కాదని మగవారు వెళితే వైవాహిక జీవితం దెబ్బతింటుందని నమ్మకం. ఇక మగవారికి ప్రవేశం లేని రెండో ఆలయం అట్టుకల్ ఆలయం, తిరువనంతపురం, కేరళ. ఇక్కడ గుడిలో కొలువై ఉన్న కన్నకీ అమ్మవారిని దర్శించుకోవడానికి పురుషులు వెళ్లరు. ఆడవారు మాత్రమే ఆమెను పూజించడం ఆనవాయితీ.
కేరళలో మగవారు నిషేధింపబడ్డ ఆలయాల్లో మరొకటి చక్కులతుకవు భగవతీ ఆలయం. ఈ ఆలయం అలప్పుజ ప్రాంతంలో వుంది. సంక్రాంతి సమయంలో ఈ ఆలయంలో కూడా స్త్రీలే ప్రత్యేక పూజలు చేస్తారు. నారీ పూజగా చెప్పే ఆ క్రతువులో మొత్తం అంతా ఆడవారిదే ఆధ్వర్యం. అలాగే ధను అనే పేరుతో కూడా చక్కులతుకవు ఆలయంలో సంబరాలు జరుగుతాయి. ఆ సమయంలోనూ ఆడవారు పది రోజుల పాటూ ఉపవాసం చేసి అమ్మను ప్రత్యేకంగా పూజిస్తారు.