అలాంటి వారిని చూసేందుకు యమునికి కూడ శక్తి చాలదట...

శనివారం, 21 అక్టోబరు 2017 (22:00 IST)
పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అని చెపుతారు. ఐతే కార్తీకమాసంలో ఉసిరిచెట్టు క్రింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యమునికి కూడ శక్తి చాలదట. కార్తీక మాసంలో వచ్చే సోమ, శని వారాల్లో శ్రీమహావిష్ణువును ఉసిరితో అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. 
 
ఉసిరి ఔషధీ గుణము కలది కనుక, వనభోజనాల వలన ఆరోగ్యం చేకూరుతుంది. ఉసిరి పూజ వలన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్లలో స్థిరనివాసం ఏర్పరుచుకుంటుందని, కార్తీక మాసంలో స్నానాలు, దీపారాధన, జాగరణ, తులసి, ఉసిరి పూజల వలన, ధన, ఫల, భూదానాల వలన పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు. 
 
ఈ కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులయితే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారని విశ్వాసం. యజ్ఞయాగాదులకన్నా కార్తీకవ్రతం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. 
 
తీర్థయాత్రల వల్ల కలుగునటువంటి ఫలం, ఈ కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువుని ఎక్కడైతే పూజిస్తారో, అక్కడ భూత, పిశాచ, గ్రహ గణాలు దూరంగా ఉంటాయి. శివుడికి ప్రీతికరమైన జిల్లేడుపూలతో పూజించితే దీర్ఘాయులై, మోక్షాన్ని పొందుతారు. శుద్ధ ద్వాదశినాడు శివునికి మారేడు దళాలతో, జిల్లేడుపూలతో, విష్ణువుకు తులసీ దళాలతో, జాజిపూలతో పూజ అత్యంత శ్రేష్టమని పండితులు చెబుతున్నారు.
 
ఈ మాసంలో ఉదయం, సాయంత్రంవేళల్లో ఆవు నేతితో గాని, నువ్వులనూనెతో గానీ దీపారాధన చేసి, అభిషేక ప్రియుడైన ఈశ్వరునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అర్చనలు చేయడం వలన మహా పుణ్యం లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు