2018 కొత్త సంవత్సరం... అందుకోసం మీరొక చిరునవ్వు చిందించండి...
బుధవారం, 13 డిశెంబరు 2017 (16:26 IST)
మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకొని చూసుకోండి, “గత సంవత్సరంలో నేను ఎన్ని సార్లు పున్నమి చంద్రుడ్ని చూసాను? ఎన్ని సార్లు సూర్యోదయం చూసాను? ఓ పువ్వు వికసిస్తూ ఉండే వేళ దానిని చూడడం కోసం ఎన్ని సార్లు ఆగాను? ఓ సీతాకోక చిలుక ఎగరడం ఎన్ని సార్లు చూసాను? నన్ను చూసి నేను ఎన్ని సార్లు నవ్వుకోగలిగాను?”
నేను మిమ్మల్ని రోజూ పొద్దునా సాయంత్రం సూర్యోదయం, సూర్యాస్తమయం చూడాలని చెప్పడం లేదు. జీవితంలో ఉన్న నిధి ఇదే..! ఇదే కదా ఒక రోజుకి సరైన కొలమానం. రోజు అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, చంద్రోదయం నుంచి చంద్రాస్తమయం వరకు. అంతే కానీ ఆఫీసు నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీసుకి లేదా ఒక వ్హాట్స్అప్ మెస్సేజి నుంచి మరో వ్హాట్స్అప్ మెస్సేజి వరకు కాదు. భూమి పరిభ్రమిస్తోంది కాబట్టి, చంద్రుని ఆవృతాల వల్ల, సూర్యుని కిరణాల వల్లే కదా రోజు అనేది కలుగుతోంది. ఈ ఎరుకతో ఉండడమే మీరు ఈ జీవితానికి, మీ చుట్టూ ఉన్న సృష్టికి ఇంకా మీలో మీరు సజీవంగా ఉండడమంటే. ఈ ఎరుకతో ఉండడమంటే మీరు మీ ఆలోచనలలో మరీ అంతగా కూరుకుపోలేదని అర్ధం.
నేను మిమల్ని రోజూ పొద్దునా సాయంత్రం సూర్యోదయం, సుర్యస్థామానం చూడాలని చెప్పడం లేదు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మీరు మీ చుట్టూ ఉన్న సృష్టితో సజీవంగా ఉన్నారా లేదా అని. మీరు చూసిన గొప్ప సూర్యాస్తమానం, ఎవరో మీకు పంపిన వాట్స్‌యాప్ మెసేజి లోనిదా?
రెండో విషయం ఏమిటంటే, ఏ వ్యాపారంలోనైనా లెక్కల పద్దు చూసుకోవాలి. ప్రజలు ఇది పన్నుల శాఖ వారి కోసం చెయ్యాలి అనుకుంటారు. కానీ నిజానికి, మీరు లెక్క చూసుకోకపోతే మీకు లాభం వస్తోందో నష్టం వస్తోందో ఎలా తెలుస్తుంది. మీరు మీ డబ్బుకు లెక్కలు నిపుణుల్ని పెట్టి మరీ చూసుకుంటున్నారు, మరి జీవితానికి సంబంధించిన లెక్కల సంగతి ఏమిటి? జీవితానికి సంబంధించిన లెక్కలు చూసుకోవడాని ఇవ్వాళ చాలా మంచిరోజు : మీరు ఇంతకు మునుపు కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారా? మరింత వివేకంతో ఉన్నారా? మరింత పరిణితి చెందారా? మీరు ఇంకా ఎక్కువ ప్రేమగా ఉన్నారా? మీకు ఇదివరకు కంటే ఎక్కవ స్నేహితులు ఉన్నారా లేకపోతే మీకు శత్రువులు పెరిగారా?
సంతోషమైన కొత్త సంవత్సరం కోసం మూడు ముక్కలు
ముందు, తీర్మానాలు చేసుకోవడం అనే అలవాటును వదిలేయండి. ఒక తీర్మానం అంటే, మీరు మీ మీద నిర్బంధనలు పెట్టుకోవడమే కదా. మిమ్మల్ని చింతచెట్టుకి తల్లకిందులుగా వెళ్లాడ తీయాలని ప్రభుత్వం ఓ తీర్మానం చేసిందనుకోండి, మీరు ప్రతిఘటించరూ? మీరు తీర్మానం చేసినా అంతే. మీరు ఎరుకతో జీవించడానికి బదులుగా నిర్భందనలు విధించుకుంటే, అది మీకు ఎలా మేలు చేస్తుంది? మీ మీద మీరు ఆంక్షలు పెట్టుకునే బదులు, ఇంతకంటే మెరుగైన జీవిగా పరిణితి చెందడం నేర్చుకోండి.
ఈ కొత్త సంవత్సరంలో మీకోసం ఇది చేసుకోండి – కనీసం పౌర్ణమి రాత్రులు , ఏదైనా ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళండి, మీరు అక్కడ నుండి చంద్రుడిని చూడగలిగేలాంటి ప్రదేశం. పూర్వం, భారతదేశంలో ఇది చాలా సామాన్యమైన విషయం – పౌర్ణమి రాత్రుల్లో ప్రజలు ఏదో ఒక ఆలయానికి వెళ్ళేవారు, సాధారణంగా కొండ మీద ఉండే ఆలయానికి వెళ్లి అక్కడ అర్ధరాత్రి వరకు ఉండే వారు. కొండ మీద ఉన్నప్పుడు మీరు చంద్రుడిని చూడకుండా ఉండలేరు కదా..! ఇందులో ఉద్దేశం దేవుణ్ణి చూడడమో మరొకటో కాదు. మీ చుట్టుతా ఎంత సృష్టి ఉందో, అందులో మీ పాత్ర ఎంత చిన్నదో మీరు తెలుసుకోవడానికి. కానీ మీ గురించి మీరు ఎంత గొప్పగా ఆలోచించుకుంటారు? ఈ అనంత విశ్వంలో, మీ గురించి మీకు ఎంత తప్పుడు అవగాహన ఉందో చూడండి. ఇది కేవలం, మీకు ఆ విషయం తెలియాలనే..!
ఈ సంవత్సరం మీరు ఎంత ఆనందంగా ఉంటారో, మీ చుట్టూ ఉన్న వారికి ఎంత ఆనందం పంచుతారో చూసుకోండి. సంతోషం అంటే తెలియనివారు గానీ, సంతోషంగా ఉండాలనుకోని వారు గానీ ఉండరు. అందరికీ ఆనందంగా ఉండటం తెలుసు, అందరికీ ఆనందంగా ఉండాలని కూడా ఉంది…”కానీ”. ఈ ‘కానీ’ అడ్డంకిగా ఉన్నప్పుడు దాన్ని అవతలకు తన్నేయాలని తెలుసుకోండి. ఈ 2018లో, మీరు సమయం తెలుసుకోవడానికి మీ గడియారం చూసినప్పుడల్లా, మీ కోసం మీరొక చిరునవ్వు చిందించండి. ఎందుకంటే, గడిచిపోతున్నది సమయం మాత్రమే కాదు, మీ జీవితం కూడా. మీరు గడియారం చూసినప్పుడు, ఈ భూమి మీద గడిచిన 10,000 సంవత్సరాల్లో, కిందటి ఏడాదిలో, కిందటి నెలలో, కిందటి వారంలో ఎంతమంది చనిపోయి ఉండచ్చో తలచుకోండి. కిందటి రోజు ఎంతమంది చనిపోయి ఉండచ్చు..! కానీ, మీరు ఇంకా సజీవంగా ఉన్నారు – మీరు అందుకోసమైన చిరునవ్వుతో ఉండాలి. మీరు సమయం చూసినపుడల్లా, మీ జీవితం గడిచిపోతోంది, కానీ మీరింకా సజీవంగానే ఉన్నారు – అందుకోసం మీరొక చిరునవ్వు చిందించండి…!!!