భక్తి ఎక్కడుంటుందో.. దైవమూ అక్కడే ఉంటాడు!

గురువారం, 8 జనవరి 2015 (16:06 IST)
ధర్మాన్ని పాటిస్తే, ఆ ధర్మమే మనలను కాపాడుతుంది. ధర్మో రక్షిత రక్షితః అన్నారు జ్ఞానులు. ధర్మంకాని పనిచేయడం భక్తి అనిపించుకోదు. స్వలాభం కోసం చేసే ధర్మాలు నిజమైన ధర్మాలు కావు. పది మందికి ప్రయోజనకరంగానూ, హర్షించే విధంగానూ శాస్త్రసమ్మతంగానూ ఉండటం ధర్మం లక్ష్యం. 
 
మనిషిలో మానవత్వం, ఆధ్యాత్మికతను నింపి, వాటికి ధార్మికత్వం జోడిస్తూ దైవత్వం వైపు నడిపించేదే మతం. మతం ఏదైనా ఆ మతాన్ని విశ్వసించి, ఆచరించే వారిలో భక్తిభావనలు కలిగించాలి. జీవితాన్ని సాత్వకబుద్ధితో, సద్భావంతో నింపేదే భక్తి. 
 
అటువంటి శక్తే దైవాన్ని చేరే ప్రయత్నాన్ని వేగవంతం చేస్తుంది. భక్తితోనే మన మనసు పరిశుద్ధం అవుతుంది. ఆ సర్వేశ్వరుని పాద కమలాలపై మనస్సు లయమయ్యేటట్లుగా చేస్తుంది. భక్తి ఎక్కడ ఉంటే ఆ భగవంతుడు కూడా అక్కడే ఉంటాడు.
 
మనస్సును, బుద్ధిని, ఆత్మను పరిశుద్ధంగా, పవిత్రముగా చేసేది తిరుమల వాసుడైన వేంకటేశ్వరుని దివ్య నామస్మర ఒక్కటే. నిరంతరం ఆ వేంకటేశ్వరుని నామ స్మరణ చేయడానికి తగిన శక్తిని, సామర్థ్యాన్ని, భక్తిభావనను ఇమ్మని, ఆ స్వామిని ప్రార్థిస్తే.. ఆయనే మనకి ముక్తిని ప్రసాదిస్తాడు. 

వెబ్దునియా పై చదవండి