తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాల గురించి మీకు తెలుసా..!
సోమవారం, 11 అక్టోబరు 2021 (14:14 IST)
తిరుమల వెంకన్న...కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడని...తమ కష్టాలను తొలగించే దివ్యపురుషుడని.. భక్తుల విశ్వాసం.. అందుకే నిత్యం లక్షల్లో భక్తులు తిరుమల వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామి వారి దర్శనం తర్వాత, స్వామి వారి ప్రసాదమైన లడ్డూనూ తమతో పాటూ ఇంటికి తీసుకెళ్తారు.. ఈ లడ్డూని తమ ఇంటిలో భక్తిశ్రద్దలతో పూజించి, తమ బంధువులకి,మిత్రులకి పంచిపెడుతారు.
తిరుమల అనగానే లడ్డూ అన్నతంగా భక్తుల మదిలో నిలిచిపోయింది తిరుమల లడ్డూ.. ఇంతవరకు బాగానే ఉంది.. తిరుమల శ్రీవారికి లడ్డూ మత్రామే కాదు..రకరకాల ప్రసాదాలు,నైవేద్యంగా సమర్పిస్తారు ఆలయ అర్చకులు.. ఈ ప్రసాదాలు ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు. అసలు స్వామి వారికి ఎన్నిరకాల ప్రసాదాలు నైవేద్యంగా నివేదిస్తారు.. ఈ ప్రసాదాల వెనుక ఉన్న కథేంటో మీరే చదవండి.
తిరుమల శ్రీవారి ఆలయంలో పూజలు, ఉత్సవాలు అన్నీ పక్కాగా ఆగమశాస్రం ప్రకారం నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు పూజల్లో ఏపాటి చిన్ని పొరపాటు లేకుండా జాగ్రత్తగా చేస్తారు ఆలయ అర్చకులు.. యుగాలు గడిచినా తరాలు కనుమరుగైనా తిరుమల పూజల్లో మాత్రం ఏమార్పు రాలేదు.. నాటి పూజా విధానాన్నే నేటికీ కొనసాగిస్తున్నారు.. అందుకే తిరుమల క్షేత్రం నిత్య నూతనంగా భాసిల్లుతుందని భక్తులు నమ్మకం.. ఇక స్వామి వారికి సమర్పించే నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉంది.
సుప్రభాత సమయంలో స్వామి వారికి వెన్నతో మొదలు పెట్టి, లడ్డూ, వడ, పోంగలి, దద్దోజనం, పులిహారా, వడ పప్పు, మురగాన్నం ఇలా రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు.. తిరుమల అనగానే మనకు లడ్డూ మాత్రమే గుర్తుకు వస్తుంది.. అయితే లడ్డూతో పాటు రకరకాల దివ్య ప్రసాదాలను స్వామి వారికి నివేదిస్తారు.. శ్రీవారికి ప్రాచీన కాలంలో నుంచి ఈ ప్రసాదాలను నివేదిస్తున్నప్పటికీ మనకి పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు చరిత్రక ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
విజయనగర సామ్రాజ్యంలోని రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత ఎక్కువ పెంచినట్టు ఆధారాలున్నాయి.. ఈ సమయంలో మంత్రిగా పని చేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేసినట్టు తెలుస్తుంది.. రెండవ దేవరాయల కాలంలోనే స్వామివారికి నివేదించాల్సిన ప్రసాదాలు వాటిని స్వామి వారికి సమర్పించాల్సిన సమయాన్ని ఖరారు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి..
శ్రీవారి ఆలయంలో స్వామి వారికి రకరకాల ప్రసాదాలు నివేదిస్తున్నలప్పటికీ స్వామి వారికి అత్యంత ఇష్టమైన ప్రసాదం లడ్డూ.... ప్రస్తుతం ఆలయంలో ఉన్న ప్రసాదాల్లో లడ్డూను పురాణకాలం నుంచి స్వామి వారికి నివేదిస్తున్నటు తెలుస్తుంది.. అయితే 1455లో సుఖీయం, అప్పంను, 1460లో వడను, 1468లో అత్తిరసంను, 1547లో మనోహరపడి ప్రసాదాలను ప్రవేశపెట్టినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.. వీటిలో వడ తప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు.. అయితే అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది.. నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించడం ప్రారంభించారు.. ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది..
12వ శతాభ్ధం నాటి మానసోల్లాస గ్ర౦థ౦లో తిరుమల లడ్డూ ప్రస్తావన ఉ౦ది.. తిరుమలలో 1942 నుంచి భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నారు.. మొదట్లో బూందీగా ఇచ్చే ఈ ప్రసాదం తర్వాత లడ్డూగా తయారు చేసి ఇచ్చేవారు..ఈ లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్దతులను పాటిస్తుంది టీటీడీ.. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్చమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడీపప్పు, పచ్చకర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు. 51 లడ్డూలను ఒక ప్రోక్తం అంటారు.. ఒక్కోసారి వెయ్యి ప్రోక్తాలను తిరుమలలో తయారు చేస్తారు.. అంటే 51 వేల లడ్డూలన్న మాట.. ఇందుకు గాను 2వేల కిలోల శనగ పిండి, 4వేల కిలోల చక్కెర, 1850 కిలోల నెయ్యి, 350 కిలోల జీడిపప్పు, 80 ఏడున్నర కిలోల ఎండుద్రాక్ష, 50 కిలోల యాలకులు, 50 కిలోల కలకండ అవసరం అవుతుంది.
రోజుకు లక్షా పాతిక వేల లడ్డూలను తితిదే పోటు కార్మికులు తయారు చేస్తున్నారు.. ప్రస్తుతం తిరుమలలో మూడు రకాల లడ్లూలు అందుబాటులో ఉన్నాయి.. అవి ఆస్ధానం లడ్డూ,కళ్యాణోత్సవ లడ్లూ,ప్రోక్తం లడ్డూ.. వీటిలో ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే అందజేస్తారు.. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంత మామిడి పప్పు, కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు.. వీటిని ప్రత్యేక ఉత్సవాలు సందర్భంగా మాత్రమే తయారు చేస్తారు.. ప్రత్యేక అతిధులకు మత్రమే వీటిని అందజేస్తారు.. ఇక మూడవ రకం లడ్డూ ప్రోక్తం లడ్డూ వీటిని సాధారణ దర్శనానికి వచ్చిన భక్తులకు అందజేస్తారు.
తిరుమలలో మాత్రమే అందరికి పరిచయం.. అయితే లడ్డూ, వడతో పాటు స్వామి వారికి చక్కెరపోంగళి,బెల్లం పోంగళి, పులిహోరా, దద్దోజనం, వడపప్పు, చిన్నలడ్డూ, మిరియాల అన్నం, కలకండ లాంటి ప్రసాదాలను నివేదిస్తారు.. ఈ ప్రసాదాలను స్వామి వారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఉచితంగానే టీటీడీ అందిస్తుంది.. వీటితో పాటు ప్రత్యేక ప్రసాదాలైనా మురుకు, జిలేబీ, ఫోళీలు, సమోసా, పాయసం, పెద్దవడ, సీర, బెల్లం, దోశ, మురగాన్నం, ఆపం లాంటి ప్రసాదాలను స్వామి వారికి నివేదిస్తుంది టీటీడీ.. అయితే ఈ ప్రసాదాలను సామాన్య భక్తులకు అందుబాటులో లేవు.. ప్రత్యేక ఆర్జీత సేవలు చేసుకునే భక్తులకి ఈ ప్రసాదాలను టీటీడీ అందిస్తుంది.. స్వామి వారికి సోమవారం ప్రత్యేకంగా పాయసం, పెద్దవడను, గురువారం నాడు మురుకు, జిలేబీని, శుక్రవారం నాడు ఫోళీ, సమోసాను నివేదిస్తారు.
స్వామి వారికి నివేదించే అన్ని ప్రసాదాల్లోకేల్లా లడ్డూకి ఎంత ప్రాముఖ్యత ఉందో... జిలేబీకి కూడా అందే ప్రాముఖ్యత ఉంది.. ఈ జిలేబీని కేవలం గురువారం మాత్రమే తయారు చేసి స్వామి వారికి నివేదిస్తున్నారు.. ఈ జిలేబీని పోందటం కోసం మంత్రులు సైతం సిఫార్సు చేస్తారంటే పరిస్ధితి అర్ధం చేసుకొవచ్చు.. జిలేబీ తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది టీటీడీ.. ఈ జిలేబీని నోటిలో వేసుకుంటే చాలు మెత్తగా కరిగిపోయి మధురానుభూతిని ఇస్తుంది.