ప్రపంచంలో దరిద్రుడు ఎవరు? ధనవంతుడు ఎవరు?

సోమవారం, 27 అక్టోబరు 2014 (17:33 IST)
ఆభరణాలు, ఇళ్ళు, వాహనాలు ఎన్ని ఉన్నా.. ఇవన్నీ ఒక్కరి చేతిలో ఉన్నప్పటికీ ఇంకా కావాలని తాపత్రయపడటం.. అజ్ఞాని లక్షణం. ఆశకు అంతం లేదు. సముద్రంలోనికి ఎన్నో నదుల నీరు వచ్చిపడుతున్నప్పటికీ సముద్రం చాలు అనదు. ఎంత జలాన్నయినా స్వీకరిస్తూనే ఉంటుంది. 
 
ఆశ చాలా చెడ్డ గుణం. అది గనుక యుంటే మానవుడికి అసలు తృప్తి అనేది యుండదు. ప్రాపంచిక విషయాలను కోరుతూనే యుంటాడు. తత్ఫలితంగా అతడు శాంతిని నోచుకోలేడు. ఎప్పుడూ ఏదో మనస్తాపన అతడిని బాధిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కోరిక అతన్ని వేధిస్తూనూ ఉంటుంది. 
 
ప్రపంచంలో దరిద్రుడు ఎవరు? అను ప్రశ్నకు జవాబేంటంటే ఎక్కువ ఆశగలవాడే. అని ఆదిశంకరాచార్యులవారు ఆనతి ఇచ్చివున్నారు. ధనవంతుడు ఎవరు? అనే ప్రశ్నకు తృప్తిగల వాడే అని సెలవిచ్చారు. కనుక ఎక్కడో ఒక చోట ఆశను అంతమొందించి సంతుష్టికి హృదయమందు చోటివ్వాలి. 
 
భగవంతుడు ఇచ్చిన ఈ పదార్థం నాకు చాలు. దీనితో పరితృప్తి నొందుతాను అని నిశ్చయం కలిగివుండాలి. జీవితంలో శాంతి సుఖములను అభిలషించేవాడు ఆశకు ఏమాత్రం చోటు ఇవ్వకుండా యదృచ్ఛాలాభసంతుష్టుడై మెలగాలి. తనకు శక్తియున్నంత వరకు ఇతరులకు సాయపడాలే కాని ఇతరుల సొత్తును ఆపేక్షించరాదు. 
 
భోగాశను వదిలిపెట్టి, విషయతృష్ణను వదిలి దైవచింతనలో కాలం గడుపుతూ నిరంతర సంతుష్టుడై పరమశాంతిని, ఆనందాన్ని అనుభవిస్తూ జీవించడమే విజ్ఞుని లక్షణం. 

వెబ్దునియా పై చదవండి