చివరకు వేశ్యను అమ్మా అని సంబోధిస్తూ అతడామెను వదిలిపెట్టేశాడు

శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (11:30 IST)
భగవంతునితో మనస్సు యోగం చెందినప్పుడు ఆయన్ను అతి సమీపంగా చూడవచ్చు. హృదయ మధ్యంలో చూడవచ్చు. కానీ ఒక ముఖ్య విషయం. ఈ యోగం ఎంత గాఢతరమవుతుందో అంతగా మనస్సు బాహ్య వస్తువుల నుండి వైదొలుగుతుంది. ఇందుకు తార్కాణంగా ఒక కధ చెబుతాను. బిల్వమంగళుడు అనునతడు ఒక వేశ్య వద్దకు వెళ్తుండేవాడు. ఒక రోజు రాత్రి వెళ్లేసరికి చాలా ఆలస్యమయ్యింది. ఆ రోజు ఇంట్లో తల్లిదండ్రుల శ్రాద్దకర్మ చేసినందుకు ఆలస్యమైంది. 
 
వేశ్య కోసం శ్రాద్ద భోజనం చేతిలో పట్టుకుని వెళుతున్నాడు. అతని మనసంతా ఆ వేశ్య మీదనే నిమగ్నమై ఉంది. ఎలా వెళ్తున్నాడో, దేని మీద అడుగులు వేస్తున్నాడో కూడా అతనికి ఎరుక లేదు. దారిలో ఒక యోగి కళ్లు మూసుకుని భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాడు. బిల్వమంగళుడు ఆ యోగిని తొక్కుకుంటూ వెళ్లాడు. యోగి కోపంతో కళ్లు కనిపించడం లేదా... నేను భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాను. నువ్వు నన్ను తొక్కుతూ వెళ్తావా అని అరిచాడు.
 
అందుకు బిల్వమంగళుడు ఇలా అన్నాడు.... స్వామీ నన్ను మన్నించండి.... కానీ మిమ్మల్ని ఒక్క విషయం అడగాలి. నేను వేశ్యను గురించి ఆలోచిస్తుండటం వలన నాకు స్పృహ లేకపోయింది. మరి మీరో... భగవంతుడి గురించి ఆలోచిస్తూ కూడా మీకు బాహ్య ప్రపంచపు స్పృహ ఉందే.... ఇదేం ధ్యానం.... అన్నాడు. అంతటితో అతని మనసు భగవధ్ధ్యానం వైపుకు మళ్లింది. చివరకు బిల్వమంగళుడు సంసారం వదిలిపెట్టి కేవలం భగవదారాధనకై వెళ్లిపోయాడు. వెళ్లే ముందు వేశ్యతో ఇలా అన్నాడు.... నువ్వు నా గురువు. భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో నువ్వు నాకు నేర్పావు అని ఆమెకు నమస్కరించాడు. చివరకు వేశ్యను అమ్మా అని సంబోధిస్తూ అతడు ఆమెను వదిలిపెట్టేశాడు.
 
- శ్రీరామకృష్ణ పరమహంస

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు