సీతాదేవి తండ్రి జనకుడు జ్ఞాని ఎలా అయ్యాడు?

శుక్రవారం, 8 నవంబరు 2019 (21:38 IST)
మిథిలానగరాన్ని పరిపాలించే జనకునికి రాజర్షి అని బిరుదు. ఆయనను గొప్ప జ్ఞానిగా అందరూ భావించి గౌరవించేవారు. అయితే ఆయనలోని జ్ఞానం ఆయన ముఖంమీద తాండవిస్తూ ఉంటుందా? అందులోనూ ఉదయం నుంచి రాత్రివరకు రకరకాల లౌకికవ్యవహారాలలో మునిగి తేలే ఒక రాజును జ్ఞానిగా ఎలా భావించడం!. 
 
జనకుని రాజర్షిగా, జ్ఞానిగా అందరూ ఎందుకంటున్నారో, అందులోని విశేషమేమిటో తేల్చుకుందామనుకున్నాడు ఒక సాధువు. నేరుగా జనకుని ఆస్థానానికి వెళ్ళాడు. జనకుడప్పుడు మంత్రులతో మంతనాలు జరుపుతున్నాడు. ప్రజల బాగోగుల గురించి అడిగి తెలుసుకుంటున్నాడు. కప్పం చెల్లించని సామంతరాజులపై కోపం ప్రకటిస్తున్నాడు.
 
ఎతైన సింహాసనం మీద కూర్చున్న జనకునికి పరిచారకులు అటూ ఇటూ నిలబడి వింజామరలు వీస్తున్నారు. ఒకరు పాదాలు ఒత్తుతున్నారు. ఆయన కిరీటంలో పొదిగిన మణిరత్నాలు జిగేలుమంటున్నాయి. ఎటుచూసినా ఆడంబరమూ, అతిశయమే. సాధువు ఇదంతా గమనిస్తున్నాడు. అతనకీ వరస ఏమీ నచ్చలేదు. ఇతడన్నీ లౌకికవిషయాలే మాట్లాడుతున్నాడు. లౌకికమైన సిరిసంపదలతో తులదూగుతున్నాడు. ఇతడు రాజర్షీ, జ్ఞానీ ఎలా అవుతాడు? ఇతణ్ణి జ్ఞాని అన్నవాళ్ళు పరమ అజ్ఞానులు - అనుకున్నాడు.
 
సాధువు ఆస్థానంలోకి అడుగు పెడుతున్నప్పుడే అతని మీద జనకుని దృష్టి పడింది. మంత్రులతో మాట్లాడుతూనే అతనిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. అతని మనోభావాలను అంతర్దృష్టితో గమనిస్తూనే ఉన్నాడు. సాధువును తన వద్దకు పిలిపించుకున్నాడు. సాధువు వేషంలో ఉన్నావు కానీ, నువ్వు నిజమైన సాధువువి కావు అన్నాడు. సాధువు తెల్లబోయాడు. ఎప్పుడూ ఇతరులలో తప్పు లెంచే స్వభావం నీది. దానితోనే నీ సమయమంతా ఖర్చయిపోతోంది. భగవధ్యానానికి నీకు తీరికేదీ?
 
సాధువు మరింత నివ్వెరపోయాడు. నా దృష్టిలో నువ్వు నేరస్థుడివి. రాజుగా నిన్ను శిక్షించక తప్పదు. నీకు మరణశిక్ష విధిస్తున్నాను. వారం రోజుల్లో నిన్ను ఉరితీస్తారు. సాధువు గజగజ వణికిపోతూ నిలబడ్డాడు. జనకుడు అలా ప్రకటించిన వెంటనే భటులు సాధువును తమ అదుపులోకి తీసుకున్నారు. చెరసాలకు తరలించారు.
 
అతడికి రోజూ ఉప్పులేని కూరలు, కారం కలిపిన తీపిపదార్థాలు ఆహారంగా పెట్టమని జనకుడు సేవకులను ఆదేశించాడు. అయితే ఆ సాధువు వాటి రుచిని పట్టించుకునే స్థితిలో ఉన్నాడా? కళ్ళు మూసినా తెరచినా అతనికి ఉరికంబమే కనిపిస్తోంది. తన మెడ చుట్టూ ఉరితాడు బిగుసుకుంటున్న దృశ్యమే కళ్ళముందు కదులుతోంది. కంటిమీద కునుకే కరువైపోయింది. ఆ వారంరోజుల్లోనే అతడు మరణభయంతో, మనోవ్యధతో చిక్కి శల్యమైపోయాడు. ప్రాణాలు కళ్ళల్లోకి వచ్చేశాయి.
 
ఏడవరోజున సాధువును ఉరి తీయడానికి సన్నాహాలు చేయమని జనకుడు ఆదేశించాడు. తను కూడా ఉరి తీసే ప్రదేశానికి వెళ్ళాడు. భటులు చెరోవైపూ చేతులు పట్టుకుని, అతికష్టంమీద అడుగులు వేస్తున్న సాధువును తీసుకొచ్చి జనకుని ముందు నిలబెట్టారు. మృత్యుభయంతో సాధువు స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటి తర్వాత స్పృహ వచ్చింది. అప్పుడు జనకుని ఆదేశంపై సేవకులు అతనకి ఉప్పు కలిపిన పాలు ఇచ్చారు. సాధువు ఆ పాలను గడగడ తాగేశాడు.
 
పాలు బాగున్నాయా? పంచదార సరి పోయిందా? అని ప్రశ్నించాడు జనకుడు చిరునవ్వుతో. ఎందుకడుగుతావు మహారాజా! ఈ వారంరోజులుగా పదార్థాల రుచిని గమనించే స్థితిలో ఉన్నానా నేను? నాకు ప్రతిక్షణమూ, ప్రతిచోటా ఉరికంబమే కనిపిస్తోంది, అన్నాడు సాధువు. జ్ఞానబోధకు ఇదే తగిన సమయమనుకున్నాడు జనకుడు.
 
ఈ వారం రోజులూ నువ్వు ఏం చేస్తున్నా, ఏం తింటున్నా, నీ దృష్టి చేస్తున్నవాటిమీద, తింటున్నవాటిమీద లేదు. కేవలం ఉరికంబమే నీకు కనిపించింది. అలాగే నేను రోజూ ఉదయం నుంచి రాత్రివరకూ అనేకమైన లౌకికివిధులు నిర్వర్తిస్తున్నా నా దృష్టి మాత్రం ఎల్లవేళలా పరబ్రహ్మతత్త్వం పైనే లగ్నమై ఉంటుంది. విశేషధ్యానంతోనే నాస్థితిని సాధించాను. నేనీ ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి అతీతంగా ఉండగలను. నా మనస్థితి ఎటువంటిదో ఇప్పుడైనా అర్థమైందా?
 
ఇక ముందెప్పుడూ ఇతరుల లోపాలను ఎంచే ప్రయత్నం చేయకు. నీ బాగు నువ్వు చూసుకో. ఇతరులలో మంచినే చూడడం నేర్చుకో. తపస్సుతో , ధ్యానంతో పరమసత్యాన్ని తెలుసుకో. ప్రపంచానికి అతీతంగా ఉంటూనే ప్రపంచ క్షేమం కోసం పనిచెయ్యి. ఇక వెళ్ళు!. సాధువుకు జనకుని ఔన్నత్యం, తన అల్పత్వం అర్థమయ్యాయి. అతనికి శిరసు వంచి నమస్కరించి అక్కడినుంచి నిష్క్రమించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు