వేశ్యతో సంపర్కం పెట్టుకున్నాడు... మొదటి మెట్టుపై కాలు పెట్టగానే...
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (22:18 IST)
తిరుమల క్షేత్రాన్ని కాలినడకతో అధిరోహిస్తే పాప ఖర్మలన్నియూ దహించుకుపోతాయి. శ్రీనివాసా కరుణాసముద్రా.. రాబోయే కలియుగం అత్యంత పాపభరితం కానున్నది. కలియుగం మనుషుల్లో నీతి, నియమం.. సత్యం.. ధర్మం.. శాంతి.. అహింస.. న్యాయం.. సత్కర్మ అనేవి నామమాత్రంగానే కనిపిస్తాయని కలియుగంలో అనేక ఉత్పాతాలు సంభవిస్తాయని దైవ ద్రోహులు అధికం అవుతారని సాదుజ్ఞనులు భయపడుతున్నారు. మహర్షులు కలవరపడుతున్నారు. ప్రభూ, రాబోయే విపరీత విపత్తుల నుంచి సమస్త మానవాళి బయటపడే మార్గం లేదా? లోకంలో శాంతిని నెలకొల్పే ఉపాయమే లేదా? అని వాపోతున్నారు మహర్షులు.
ఇప్పుడు ఆనంద నిలయం మెరుపు శోభలతో పసిడి వర్ణంతో మెరుపులీనుతూ కనిపిస్తుంటే ఆ ఆనందనిలయంలోంచి తపసోత్తములారా.. భయపడకండి.. రానున్న కలియుగంలో ఎంతటి విపరీత పరిణామాలు.. విపత్తుకు కారణమైనా ఈ వెంకటాచలమును ఆశ్రయించి నన్ను భక్తితో శరణజొచ్చిన వారికి ఏ ప్రమాదాలు రావు. ఈ వేంకటాద్రి మహత్యం అంతటిది. అదిగో అటు చూడండి.. ఈ సప్తగిరిని అధిరోహించడానికి ఒక పాపాత్ముడు ఇప్పుడే నడకదారి వద్దకు చేరుకున్నాడు. అతడిని చూడండి అని శ్రీవారి వాక్కు వినిపించింది.
అప్పుడే ఆ యువకుడు మాసిన దుస్తులతో తైల సంస్కారం లేని శిరస్సుతో పంచమహాపాతకాలు పట్టినవాడు. దయనీమయైన స్థితిలో మెట్లదారి వద్దకు చేరుకుని భక్తితో చేతులు జోడించి ఏడుకొండలవాడా.. వెంకటరమణ.. గోవిందా.. గోవిందా.. అంటూ ప్రార్థిస్తూ మొదటి మెట్టు మీద కాలు పెట్టాడు. మరుక్షణం భగ్గుమని అగ్నిజ్వాల పుట్టింది అతడి పాదాల అడుగు కారణంగా మహర్షులు ఉలిక్కిపడ్డారు. మానవుని పాదాల నుంచి అగ్నిజ్వాలాలు ఎలా ఉద్భవించాయి. ఎందుకు?
అవి అగ్నిజ్వాలలు కావు మహర్షులారా.. దహించుకుపోతున్న అతడి పాపాలు.. అతడి పేరు మాధవుడు. పూర్వ పుణ్యఫలం చేత ఓ వంశంలో పుట్టారు. వేదభ్యాసం చేసి సర్వ విద్యాపారంగతుడు అయ్యాడు. కానీ బుద్ధి పెడదారి పట్టింది. కన్నవారిని కడగండ్ల పాలుచేసి మహా పతివ్రతయైన భార్యని కాదని నీచజాతిలో పుట్టిన ఒక వేశ్యతో సంపర్కం పెట్టుకున్నాడు.
మద్యపానం.. మాంసాహారం.. జూదం.. దొంగతనాలు.. పరసతి బలత్కారం.. చేయకూడని పాపాలు చేసి భ్రష్టుడయ్యాడు. నిర్జనుడు నిరాధారుడయ్యాకా అతడికి దైవ చింతన కలిగింది. అంతటి పాపాత్ముడు నన్ను దర్శించాలన్న కాంక్షతో వెంకటాచలం చేరుకున్నాడు. కాలిబాటలో మొదటి మెట్టుపై పాదం మోపగానే చూశారు.. అతడి పాదాల క్రింద నుంచి అతడి పాపాలన్నీ దహించుకుపోతున్నాయి చూశారా..!
ఇది వేంకటాచల క్షేత్ర మహత్యం. వేం అంటే పాపం. కట అంటే హరించు అని అర్థం. ఆ పాపాలు తీరి పావనుడైన మాదవుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ వచ్చి మహర్షులకు నమస్కరించాడు. ఓం నమో వేంకటాశాయ అంటూ మాదవుడిని ఆశీర్వదించారు తిరుమలేశుడు.