వినాయకుడు తులసిని ఇష్టపడడట.. ఎందుకో తెలుసా?

మంగళవారం, 31 మార్చి 2015 (14:07 IST)
తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు. అలాంటి తులసీని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. గరిక దగ్గరనుంచి అన్ని రకాల అడవిపూలు... ఆకులు ఆయన పూజకు వాడుతున్నప్పుడు, తులసి ఎందుకు వాడకూడదనే సందేహం రావడం సహజమే. అలాంటి సందేహం కలిగితే ఈ స్టోరీ చదవండి. వినాయకుడిని చూసిన ధర్మధ్వజ యువరాణి, ఆయన శక్తి సామర్ధ్యాలను గురించి తెలుసుకుంది.
 
వినాయకుడిని మోహించి తనని వివాహం చేసుకోమంటూ ప్రాధేయపడింది. అందుకు వినాయకుడు ససేమిరా అంగీకరించకపోవడం ఆమెకి ఆగ్రహావేశాలను కలిగించింది. దాంతో బ్రహ్మచారిగానే ఉండిపొమ్మంటూ శపించింది. అందచందాలను కోల్పోయి అసురులతో కలిసి జీవించమని వినాయకుడు ప్రతి శాపమిచ్చాడు.
 
దాంతో తన తొందరపాటును మన్నించమంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుని, శాపకాలాన్ని తగ్గించమని కోరింది. దాంతో కొంతకాలంపాటు రాక్షసులతో కలిసి జీవించాక, తులసిగా జన్మిస్తావంటూ వినాయకుడు ఉపశమనాన్ని కలిగించాడు. తనని శపించిన ఆమె అవతారమే తులసి కావడంవలన తన పూజలో తులసిని వాడటం వినాయకుడు ఇష్టపడడని ఆధ్యాత్మిక గ్రంధాలు తెలుపుతున్నాయి. అయితే 'వినాయక చవితి' రోజున మాత్రం పూజకు ఉపయోగించే 21 రకాల పత్రులలో భాగంగా తులసిని సమర్పించడంలో దోషంలేదని అంటున్నాయి.

వెబ్దునియా పై చదవండి