తిరుమల వెంకన్నకు దిక్కెవరు? తితిదే అధికారులకు వత్తాసుగా సీఎం.. మసకబారుతున్న తితిదే ప్రతిష్ట!

గురువారం, 23 జూన్ 2016 (13:26 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తమ పనులు చక్కబెట్టుకునే క్రమంలో స్వామినే మరిచిపోతున్నారు. వీరు ఆడింది ఆటగా, పాడిందే పాటగా సాగుతున్న తితిదే అధికార యంత్రాంగం క్రమంగా దివ్యక్షేత్రమైన తిరుమలకు భక్తులను దూరం చేస్తోంది. వేల సంవత్సరాలుగా సాగుతున్న సంప్రదాయాలు కొన్ని దర్శనాలకు నిరభ్యంతరంగా తొలగిస్తూ శ్రీవారి ఆదాయానికి గండి కొడుతున్నా అడిగే నాథుడే కరువయ్యారు. దశాబ్దాలుగా ఒద్దికగా భక్తి శ్రద్ధలతో క్రమం తప్పకుండా సాగే ఎన్నో దిన, వార, వార్షిక పూజలలో ఒకరకమైన స్తబ్దత పెరిగిపోయి నిరాసక్తంగా సాగడం, మరోవైపు కొత్తగా వచ్చిన అర్చకులు పాత తరపు పూజారులు, అర్చకుల మధ్య సమన్వయం లోపించినా సరిచేసే ఆలయ పరిపాలన ఏనాడో గాడి తప్పింది.
 
తరచూ ఆలయ పోటులో అగ్నిప్రమాదం, ఉద్యోగులలో పేరుకుపోయిన అలసత్వం, హౌస్‌ కీపింగ్‌ పేరుతో కార్మికుల పొట్టగొడుతూ నెల నెలా ఒక్కో స్వీపర్‌పై 600 నుంచి 800 వెనకేసుకుంటున్న కాంట్రాక్టర్లు పెరిగిపోతున్నారు. దాదాపు 250 మందిపై 350 కోట్లు ఖర్చు పెరుగుతున్నా హౌస్‌ కీపింగ్‌ పనుల్లో నాణ్యత లెక్కించే ప్రక్రియ తితిదే ఇప్పటివరకు లేదంటే పరిపాలన ఏ స్థాయిలో ఉందో ఇట్లే అర్థమవుతుంది. ఆరేళ్ళ నుంచి తమను బదిలీ చేయండి మహాప్రభో అని కోరుకుంటున్న ఉద్యోగులు ఎంబీసీ, సీఆర్‌ఓ, పద్మావతి అతిథి గృహం, వైకుంఠం క్యూకాంప్లెక్స్ ఆలయం సన్నిధి వరకు ఉన్నప్పటికీ ప్రభుత్వం మారితే ఒదిలీ అవుతుందని ఆశించినా పెద్దగా ఒరిగిందేమీ లేదు. తాము అప్పుడప్పుడూ విదిల్చినట్లు కేటాయించే నిధులతో తిరుపతి పురపాలక సంఘం తుడా అధికారులు ఇటీవల చేపట్టిన పనుల నాణ్యతతో పోల్చుకుంటే తితిదే పనులు దిగదుడుపే.
 
ప్రధానంగా ఎన్నడూ లేనంతగా తితిదే అధికారుల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. సీనియర్‌ అధికారులున్నా మనపై అధికారులున్న కనీస మర్యాదను కూడా పాటించని సందర్భాలు ఆశ్చర్యకరంగా ఈ మధ్యనే తలెత్తాయి. విభాగాధిపతులు, ఆ తర్వాత శ్రేణి ఉద్యోగులలో ఇటీవల రెండు మూడు వర్గాలుగా చీలిపోయినట్లు ఉద్యోగులే బాహాటంగా చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర విభజన నేపథ్యంలో వందల కోట్ల రూపాయల పనులు తితిదే అంటగడుతోంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తితిదేపై సరైన చిత్తశుద్ధి కనబరచడం లేదు. ఒంటిమిట్ట రామాలయానికి ఇప్పటికీ 50 కోట్ల రూపాయలుపైగా నిధులను మంజూరు చేయించాలని, పనులు ప్రారంభించుకుని ప్రోగ్రెస్‌ రిపోర్టు తెప్పించుకున్న ప్రభుత్వం తిరుమలలో కనీసం ఉన్నతాధికారుమల మధ్య సమన్వయాన్ని కుదర్చలేకపోతోంది. 
 
తితిదే ప్రతిష్ట ఒకవైపు భంగం కలుగుతున్నా తితిదే పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నా సీఎం తరచూ వస్తున్నా పట్టించుకోవపోవడం విడ్డూరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. తిరుపతి పట్టణానికి తితిదే నుంచి బకాయిల పేరుతో ఇటీవల దాదాపు 35 కోట్ల రూపాయల నిధులను బదిలీ చేశారు. సీఎం పలు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం కూడా సూచించారు. ఫలితంగా ఎప్పుడు వచ్చినా తిరుమలలో తితిదేలోనూ జరుగుతున్న, జరగబోతున్న అభివృద్ధి పనులపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో పాల్గొనేవారు. గత రెండేళ్లుగా ఆ మాట మరిచిపోయి ముఖ్యమంత్రి ప్రస్తుత అధికారులపై కాస్త ఉదాసీన వైఖరి కనబరుస్తున్నారు. 
 
సరిగ్గా దీన్ని అలుసుగా తీసుకుంటున్న తిరుమల తితిదే అధికారులు మరికొన్ని పనులు చేసి సీఎం ప్రాపకం తమకే ఉన్నట్టు ప్రచారం చేసుకుంటూ అదే ఉద్యోగంగా కాలం వెల్లబోస్తూ తమ సొంత పనులు మాత్రం చక్కదిద్దుకుంటున్నారు. పలు అంశాల్లో అది తితిదే విషయంలో నిశితంగా పరిశీలించి కఠినంగా ప్రవర్తించే ముఖ్యమంత్రి తితిదే అధికారులు ఆడించినట్లు ఆడటం విడ్డూరంగా ఉందని పలువురు బాహాటంగా విమర్సిస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు తన కుమారుడికి పెళ్ళి జరిగినపుడు తిరుమలకు వచ్చిన సందర్భంగా గదుల కేటాయింపులో జరిగిన అవమానాన్ని కూడా మరిచిపోవడం ఆశ్చర్యకరంగా ఉందని విమర్శిస్తున్నారు. మాజీ సీఎం హోదా కూడా ఇవ్వకుండా ఆలయం వద్ద చంద్రబాబు నాయుడును ఆహ్వానించేందుకు ఒక్క అధికారి కూడా సాహసం చేయలేదు. 
 
ఎందుకంటే వైఎస్‌ఆర్‌సీపీ అధికారం వస్తుందని అనుకున్నారు. అయితే పద్మావతి అతిథి గృహం వద్ద ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు వద్దకు అప్పటి ఓఎస్‌డిగా పనిచేసిన దామోదరం మాత్రం వెళ్ళి సర్దుబాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. కుటుంబంతో వస్తే ఇలా అవమానిస్తారా.. అని చంద్రబాబు ఒకింత ఆవేదన కూడా వెలిబుచ్చారు. అయితే అదంతా మరిచి ఇప్పుడు ఇలా అధికారం వెనకే నడవడం వెనుక మతలబుపై గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
లాభనష్టాలు, రాజకీయాలు పక్కన పెడితే కోట్లాదిమంది భక్తుల మనోభావాలు వారి కష్టాలు చెప్పుకునే ఉపశమనం పొందకలిగే ఏకైక మార్గమైన శ్రీ వేంకటేశ్వరుని దర్శన సౌకర్యంపై పలు నిర్ణయాలు తీసుకుంటూ పిల్లి తన బిడ్డలను మార్చినట్లు తరచూ క్యూలైన్లను మార్చడం ఆలోచించాల్సిన అంశం. ఒక్క శీఘ్రదర్శనం టికెట్లు అమ్మకాలపై ప్రస్తుతం నడుస్తున్న విధానం వల్ల రోజుకు 10 వేల మంది స్వామి దర్శన భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు.
 
ఇక సేవా టికెట్ల కేటాయింపు విషయానికొస్తే అదొక ప్రహసనమని అనంతపురం ఎమ్మెల్యే ఇటీవల తితిదే కార్యాలయంలో అధికారి కుర్చీలోనే కూర్చుని మీడియాతో మాట్లాడుతూ తాను, తన అమ్మ, భార్య బిడ్డలకు బ్లాకులో టికెట్లు కొన్నట్లు చెప్పారు. వెయ్యి ఎకరాలలో పలమనేరు వద్ద డెయిరీ పనులు ఎంతవరకు వచ్చాయో దేవుడికే ఎరుక. కన్యాకుమారి ఆలయం పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయి. కురుక్షేత్రం తితిదే ఆలయం పనులు ఎందుకు ఆగిపోయాయి. ముంబైలో తితిదే ఇచ్చిన స్థలాన్ని స్వాధీనపరుకున్నదెవరు? స్థానిక ఆలయాలను తిరుమల తరహా అభివృద్తికి ప్రణాళిక ఎక్కడ. ఇలా ఎన్నో శరపరంపరగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గోవిందా.. మీరే కాపాడు కోవాలి.. మీ ఆలయాన్ని స్వామి....!!! 

వెబ్దునియా పై చదవండి