ఎప్పుడు పడుకుంటున్నారు? ఎప్పుడు నిద్ర లేస్తున్నారు? ఇది చదవాల్సిందే...

సోమవారం, 21 అక్టోబరు 2019 (22:47 IST)
మనిషి పగలంతా పనిచేస్తాడు. దాంతో వారి ఇంద్రియాలు పనిచేసి అలసిపోయి ఉంటాయి. కాబట్టి వాటికి విశ్రాంతి అవసరం. నిద్రకు మూలం తమోగుణం. కడుపునిండా భుజిస్తే కంటినిండా నిద్ర వస్తుంది. సహజంగా రాత్రి పూట నిద్ర వస్తుంది. అంతేకాకుండా మనం భుజించిన ఆహారం రసంగా మారి శరీరంలోని మార్గాలను అడ్డుపడి ఇంద్రియాలను పనిచేయనీయదు. 
 
కాబట్టి నిద్ర వస్తుంది. నియమానుసారం నిద్రపోవాలి. భుజిస్తూనే నిద్రపోరాదు. కనీసం 2 గంటలైనా వ్యవధి ఉండాలి. ఆరోగ్యవంతుడికి 6 గంటలు నిద్ర పరిమితం. అంటే రాత్రి 10 గంటలకు పడుకుని తెల్లవారుజామున 4 గంటలకు లేవాలి. వృద్ధులకు 5గంటలు చాలు. ఇంతకంటే ఎక్కువకాలం నిద్రపోవడం సోమరితనం. 
 
పడుకునేటప్పుడు భగవంతుని ధ్యానించాలి. అంతకుమునుపు తన దినచర్యను మననం చేసుకొనవలెను. గుణదోషాలను విశ్లేషించుకొనవలెను. ఆ దోషములు తిరిగి చేయకుండవలెను. అప్పుడే భగవదనుగ్రహానికి పాత్రుడౌతాడు.
 
పగటినిద్ర ఆరోగ్యానికి భంగం చేస్తుంది. కావున పగలు నిద్రపోరాదన్నారు. రాత్రి నిద్రబట్టనివారు, అనారోగ్యంతో బాధపడేవారు పగలు నిద్రపోవచ్చు. వేసవి కాలంలో పగలు నిద్రించవచ్చు. నిష్కారణంగా పగలు నిద్రపోతే తలనొప్పి, ఒళ్లు నొప్పులు, తలతిరగడం, జ్వరం వచ్చినట్లుండడం. బుద్ధి పనిచేయకపోవడం, కఫం పెరగడం. ఆకలి తగ్గిపోవడం, కామెర్లు మొదలైన జబ్బులు వచ్చే అవకాశముంది. కాబట్టి ఆరోగ్యవంతులు పగలు నిద్రించకుండడం మంచిది.
 
రాత్రి 10 గంటలకు పడుకుంటే గాఢనిద్రపట్టుతుంది. అలవాటు చేసుకుంటే 4 గంటలకు లేవవచ్చును. లేచేటప్పుడు భగవంతుని ధ్యానించవలెను. భగవధ్యానంలో నిద్రమేల్కొన్న ఆ దినమంతా శుభ్రంగా గడుస్తుంది.
 
నిద్రించేటప్పుడు తూర్పు తలబెట్టుకోవడం ఆరోగ్యప్రదం. అన్ని విధాలమంచిది. అది దేవతల దిక్కు. దేవతలుండేవైపు తలబెట్టి పడుకొంటే వారి అనుగ్రహం కలుగుతుంది. దక్షిణము తలబెట్టుకొని పడుకోవడం ఆరోగ్యం బాగుంటుంది. పడమటివైపు ఉత్తరంవైపు ఎప్పుడు తలబెట్టుకొని నిద్రించరాదు.
 
పడమట, ఉత్తరంవైపు తల పెట్టుకొని నిద్రించరాదని వైఖాసనగృహసూత్రం నిషేధించింది. పురాణాలు నిషేధించాయి. మెదడుకు కీడు కలిగించే అలలు ఉత్తరం వైపు నుండి దక్షిణంవైపుకు ప్రసరిస్తున్నాయని సైన్సు చెబుతోంది కావున నిషేధించారు. ప్రాచీహి దేవానాందిన్, తూర్పు దేవతలదిక్కుకావున ఆ వైపు పాదాలు ఉంచడంవల్ల దేవతల నవమానించినవారవుతాము. తూర్పువైపు తలబెట్టుకొని నిద్రిస్తే దేవతల గౌరవించినవారమౌతాము.
 
గాఢనిద్ర ఆరోగ్యం. భగవధ్యానంచేసి పండుకొన్న చెడుకలలు రావు. 
'రామంస్కందం హనుమంతం వైనతేయం వృకోదరమ్ 
శయనే యస్స్మరేన్నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి-'
రాత్రిపూట పరుండునపుడు ఈ శ్లోకం చెప్పుకొని పరుండే సంప్రదాయమున్నది.
 
'సహస్రపరమాదేవీ శతమూలా శతాంతురా
సర్వగం హరతు మే పాపం దుర్వా దుస్వప్ననాశిన్-'
ఈ శ్లోకం దుస్వప్నాల నుండి పరిహరిస్తుంది. ప్రశాంత చిత్తంతో పరుండి ప్రశాంతచిత్తంతో లేవవలెనని పండితులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు