కరోనా వైరస్ ఎట్టకేలకు తిరుమల గిరుల్లోకి ప్రవేశించింది. ఈ వైరస్ ఏడుకొండలపైకిరాకుండా తితిదే ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ... వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేక పోయింది. ఫలితంగా తిరుమల గిరుల్లో కరోనా కలకలం చెలరేగింది. ఈ కారణంగా 17 మంది తితిదే ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్టు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుమల పుణ్యక్షేత్రంలోనూ కరోనా కలకలం అంటూ ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ, 17 మంది టీటీడీ ఉద్యోగులు కరోనా బారినపడ్డారని వివరించారు. టీటీడీ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు విస్తృత చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని దర్శనాలపై సమీక్ష నిర్వహించామన్నారు. భక్తుల సంఖ్య పెంచకుండా ఇకపైనా ఇదే విధానం కొనసాగిస్తామన్నారు. కరోనా కష్టకాలంలో ఆదాయ, వ్యయాల గురించి చూడడంలేదని, భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామన్నారు.
తిరుమలలో విధులు నిర్వర్తించడం కారణంగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రాలేదని సుబ్బారెడ్డి తెలిపారు. ఉద్యోగులలో మనోధైర్యాన్ని నింపుతామన్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో, ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగుల భధ్రతపై చర్చించడానికి కమిటిని ఏర్పాటు చేస్తున్నామని సుబ్బారెడ్డి తెలిపారు.