ఘనంగా గోవిందరాజస్వామి కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

గురువారం, 12 మే 2016 (18:36 IST)
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మే 14 నుంచి 22వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనుండటంతో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించారు. 
 
గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతా ప్రోక్షణం చేశారు. 
 
14వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 14వ తేదీ ధ్వజారోహణం, 15వ తేదీ చిన్నశేషవాహనం, హంసవాహనం, 16వ తేదీ సింహవాహనం, ముత్యపు పందిరి వాహనం, 17వ తేదీ కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, 18వ తేదీ మోహినీ అవతారం, గరుడవాహనం, 19వ తేదీ హనుమంతవాహనం, గజవాహనం, 20వ తేదీ సూర్యప్రభవాహనం, చంద్రప్రభవాహనం, 21వ తేదీ రథోత్సవం, అశ్వవాహనం, 22వ తేదీ చక్రస్నానంలు జరుగనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి