"గురు బ్రహ్మ, గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరహ.. గురు సాక్షాత్ పరబ్రహ్మ ..తస్మై శ్రీ గురవే నమః" తల్లిదండ్రుల తర్వాత గురువే ప్రధానం. ఆ తర్వాతే దైవం. అలాంటి ఆ గురువే ప్రత్యక్ష దైవమని చెప్పే గొప్ప వేడుక గురుపౌర్ణమి. ఈ పండుగనే వ్యాస పూర్ణిమ, గురుపౌర్ణిమిగా పిలుస్తారు. వ్యాసుడు మానవాళికి ఆదిగురువు అని విశ్వాసం.
వ్యాస మహర్షి జన్మతిథిని పురస్కరించుకుని ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. అలాంటి ఈ రోజున (గురుపూర్ణిమ జూలై 19) దేశ వ్యాప్తంగా ఆలయాలు ముస్తాబైనాయి. మహారాష్ట్రలోని షిర్డీలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి సాయినాథుని దర్శించుకుంటున్నారు.
షిరిడీ సాయినాథుని ఆలయం మంగళవారం ఉదయం నుంచే జనసంద్రంగా మారింది. గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. హైదరాబాద్లోని దిల్ సుఖ్ నగర్, పంజాగుట్ట, ఫిల్మ్ నగర్ సాయిబాబా ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, కడప తదితర ప్రాంతాల్లోని ఆలయాలు సాయినామస్మరణతో మార్మోగుతున్నాయి.