పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్థం.. ఎప్పటి నుంచి అంటే..?

శనివారం, 27 నవంబరు 2021 (23:18 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామి పట్టపురాణి తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్థమైంది. అయితే కరోనా కారణంగా ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది టిటిడి. దీనికి సంబంధించి 29వ తేదీన పద్మావతి అమ్మవారి ఆలయంలో అంకురార్పణ జరుగనుంది. 

 
29వ తేదీన ఉదయం లక్ష కుంకుమార్చన నిర్వహించనుంది టిటిడి. భక్తులు వర్చువల్ విధానంలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తోంది. నవంబరు 30వ తేదీ ధ్వజారోహణాన్ని నిర్వహించనున్నారు. ఆలయంలో నవంబరు 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్ధంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.45 నుంచి 10 గంటల వరకు ధనుర్లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 

 
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 8గంటల నుంచి 9గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు అమ్మవారు వాహనమండపంలో వివిధ వాహనాలపై దర్సనమివ్వనున్నారు. 

 
30వ తేదీ ధ్వజారోహణం, రాత్రికి చిన్నశేషవాహనం, 1వ తేదీన పెద్దశేషవాహనం, రాత్రికి హంసవాహనం, 2వ తేదీ ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రికి సింహవాహనం, 3వ తేదీ ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రికి హనుమంతవాహనం, 4వ తేదీ ఉదయం పల్లకీఉత్సవం, వసంతోత్సవం, గజవాహనం, 5వ తేదీ ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం స్వర్ణరథం బదులు సర్వభూపాల వాహనం, రాత్రికి గరుడ వాహనసేవలను నిర్వహించనున్నారు.

 
అలాగే 6వ తేదీ సూర్యప్రభవాహనం, రాత్రికి చంద్రప్రభవాహనం, 7వ తేదీ రథోత్సవం బదులు సర్వభూపాల వాహనం, అశ్వవాహన సేవలు జరుగనున్నాయి. 8వ తేదీ పంచమీతీర్థంను వాహనమండపంలో నిర్వహించనున్నారు. మొత్తం ఏకాంతంగానే ఉత్సవాలను టిటిడి నిర్వహించనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు