ఉజ్జయిని సింహస్థ కుంభమేళాకు పోటెత్తిన జనం.. డిగ్గీరాజా పుణ్యస్నానం.. 12 ఏళ్లకు?

శుక్రవారం, 22 ఏప్రియల్ 2016 (17:46 IST)
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగే సింహస్థ కుంభమేళాకు భక్తజనం పోటెత్తారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చారు. నెల రోజుల పాటు జరిగే ఈ కుంభమేళా శుక్రవారం ప్రారంభమైంది. పుణ్యస్నానాల కోసం భక్తులు మొదటి రోజు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఉజ్జయినిలో దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వరుడి ఆలయం ఉంది. 
 
ఈ కుంభమేళా సందర్భంగా శిప్రా నదీ తీరంలో సాధువులు, భక్తులు శుక్రవారం పుణ్యస్నానాలు ఆచరించారు. సింహస్థ కుంభమేళా సందర్భంగా ఉజ్జయినికి సుమారు 5 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈసారి ‘గ్రీన్‌ సింహస్థ’గా ఉండాలని శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ కూడా కుంభమేళాలో శుక్రవారం పుణ్యస్నానం చేశారు.  

వెబ్దునియా పై చదవండి