శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిపై హైదరాబాద్ నగర బహిష్కరణ

బుధవారం, 11 జులై 2018 (08:56 IST)
శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు హైదరాబాద్ నగర బహిష్కరణ వేటు వేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లో గృహనిర్బంధంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకుని ఇంటి నుంచి తరలించారు. అయితే ఆయనను ఎక్కడికి తరలించారనే విషయాన్ని మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు.
 
గత యేడాది నవంబర్‌లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద స్వామి చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయనకు నగర బహిష్కరణ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయన ఆరు నెలల పాటు నగరంలోకి ప్రవేశించకూదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.
 
ఇందులోభాగంగా.. ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు బుధవారం తెల్లవారుజామున నగరం నుంచి తరలించారు. ఆయనను తరలించడంలో పోలీసులు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించినట్లు సమాచారం. కొన్ని వాహనాలను ఒకవైపు, మరికొన్ని వాహనాలను మరోవైపు పంపినట్లు తెలుస్తోంది. ఆయన స్వస్థలమైన కాకినాడుకు తరలిస్తారో.. మరో చోటుకి తరలించారో అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. 
 
కాగా, ఇదిలావుండగా, ఇటీవల ఓ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో శ్రీరాముడి గురించి సినీ విమర్శకుడు కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయనపై ఆర్నెల్ల పాటు నగర బహిష్కరణ వేటు వేశారు. ఇదిలావుంటే కత్తి మహేష్ వ్యాఖ్యలకు నిరసనగా స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ పాదయాత్రను తలపెట్టారు. దీనికి హైదరాబాద్ నగర పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పైగా, ఆయన్ను గృహనిర్బంధంలో ఉంచారు. మూడు రోజులుగా ఆయన గృహ నిర్బంధంలోనే ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు