పాకిస్థాన్ - ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

ఠాగూర్

బుధవారం, 15 అక్టోబరు 2025 (14:24 IST)
పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆప్ఘాన్ సైన్యం తమపై దాడులకు పాల్పడిందని పాక్ ఆర్మీ అధికారులు ఆరోపిస్తూ, ప్రతిదాడులకు పూనుకున్నారు. దీంతో ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఆప్ఘాన్ దాడులకు ధీటుగా స్పందించి ప్రతిదాడులు చేశామని, ఆప్ఘాన్ ఆర్మీకి చెందిన యుద్ధ ట్యాంకులు, సైనిక పోస్టర్లు దెబ్బతీశాయని పాక్ అధికారులు మీడియాకు వెల్లడించారు. 
 
ఆప్ఘాన్‌లో ఖోస్ట్ ప్రావీన్స్‌లోని డిప్యూటీ పోలీసు ప్రతినిధి తాహిర్ అహర్ కూడా ఈ ఘర్షణలను ధ్రువీకరించారు. పాక్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆప్ఘాన్ దళాలు, తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ సంయుక్తంగా తమ భూభాగంలోని పోస్టులపై కాల్పులు జరిపారని పేర్కొంది. దీనికి పాక్ దళాల నుంచి బలమైన ప్రతిస్పందన వచ్చిందని తెలిపింది. టీటీపీకి చెందిన విశాలమైన శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేశామని పాక్ భద్రతాధికారులు తెలిపారు.
 
పాక్ - ఆప్ఘాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఘర్షణలపై 'జమైత్ ఉలేమా-ఈ-ఇస్లాం-ఫ్లజ్' పార్టీ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ స్పందించారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గతంలో పాక్-ఆప్ఘాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను కీలక పాత్ర పోషించానన్నారు. ఇప్పుడు కూడా తాను అది చేయగలనని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆప్ఘాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని, ఈ సమస్యను పరిష్కరించుకోవాలని వారు కూడా భావిస్తున్నారని వెల్లడించారు. ఇరుదేశాలు సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు