సంపూర్ణ చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజామువరకు కనువిందు చేసింది. ఆకాశంలో అరుణవర్ణ చంద్రుడుని చూసి ప్రతి ఒక్కరూ ఎంతో థ్రిల్‌కు గురయ్యారు. గ్రహణం వీడిన వెంటనే శనివారం ఉదయం నుంచి ఆలయాలు తెరుచుకున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రాలైన తిరుపతి, యాదాద్రి, శ్రీశైలం, బాసర ఆలయాల్లో భక్తులు దర్శనం కోసం క్యూకట్టారు. తెల్లవారుజామున నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేస్తున్నారు భక్తులు.
చంద్రగ్రహణం తర్వాత ఆలయంలో శుద్ధి, పుణ్యాహవచనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సుప్రభాతం, అర్చన, తోమాల సేవలు ఏకాంతంగా నిర్వహించారు. అనతరం ఉదయం 9 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించారు. చంద్రగ్రహణం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మహాద్వారాలు మూసివేసి… తెల్లవారుజామున 4.15 నిమిషాలకు అధికారులు తెరిచిన విషయం తెల్సిందే.
అలాగే, వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కూడా ఆలయ శుద్ధి నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆలయం చుట్టూ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత సుప్రభాత సేవ, గోపూజ చేశారు. శ్రీ లక్ష్మీ గణపతిస్వామికి ప్రత్యేక అభిషేకం... శ్రీ రాజరాజేశ్వర స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు.