భక్తులూ, ఏం ఇబ్బంది లేదు, శ్రీవారి దర్సనం మరింత సులువు, ఎలా అంటే?

సోమవారం, 10 ఆగస్టు 2020 (22:35 IST)
కరోనా కాలంలో ఆలయాలకు వెళదామన్నా భయమే. అందుకే కరోనా సమయంలో శ్రీవారి ఆలయాన్ని తెరిచినా సరే భక్తుల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గిపోయింది. మొదట్లో భక్తుల సంఖ్య బాగానే ఉన్నా ఆ తరువాత టిటిడి ఉద్యోగస్తులకే కరోనా సోకిందని, అర్చకులు కూడా కోవిడ్‌తో చికిత్స పొందుతున్నారని భక్తులకు తెలియడంతో ఇక తిరుమలకు రావడం దాదాపుగా మానుకున్నారు.
 
ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్నా తిరుమల పర్యటనను మాత్రం నిలిపేసుకున్నారు. ఇప్పటివరకు టిటిడి ఆన్లైన్లో 12 వేల టిక్కెట్లను అందజేస్తోంది. మొదట్లో 3 వేల టిక్కెట్లు ఆన్లైన్ లోను, 3 వేల టిక్కెట్లు ఆఫ్‌లైన్ లోను ఇస్తూ వచ్చింది. భక్తుల సంఖ్య కాస్త పెంచే ఉద్దేశంతో 9 వేల టిక్కెట్లను ఆన్లైన్ లోను, మరో మూడు వేల టిక్కెట్లను ఆఫ్‌లైన్లో ఇచ్చింది.
 
అయితే తిరుపతిలో కేసులు పెరిగిన దృష్ట్యా కంటైన్మెంట్ జోన్ చేయడంతో ఆఫ్ లైన్ (కౌంటర్ల) ద్వారా ఇచ్చే టోకెన్లను నిలిపేశారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే భక్తులు టోకెన్లు లేక నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోయేవారు. కానీ ప్రస్తుతం టిటిడి కౌంటర్ల ద్వారా టిక్కెట్లను ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చేసింది.
 
అతి త్వరలో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లను టిటిడి అందించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టిటిడి అధికారులు చేస్తున్నారు. గతంలో ఎలాగైతే సామాజిక దూరాన్ని పాటిస్తూ భక్తులు టిక్కెట్ల పొందారో అదేవిధంగా పొందే అవకాశం కల్పించబోతున్నారు. ఇక నుంచి భక్తులు నిరాశతో దర్సనం దొరకలేదని వెను తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. తిరుపతిలో టోకెన్లు తీసుకుని నేరుగా స్వామివారిని దర్సించుకోవచ్చు. కానీ కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు