అర్చకులను కష్టపెట్టాలన్న ఉద్దేశ్యం లేదు... 743 మందికి కరోనా : తితిదే

సోమవారం, 10 ఆగస్టు 2020 (09:33 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో విధులు నిర్వహించడం అర్చకులకు ఇపుడు కత్తిమీద సాములా మారింది. కరోనా వైరస్ సోకి ఇప్పటికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు మిగిలిన అర్చకుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అర్చక పనులు చేయడానికి పూజాకులు వెనుకంజ వేస్తున్నారు. 
 
దీనిపై తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి కల్యాణోత్సవాలను ఆపాలని అర్చకులు తమతో చర్చించలేదన్నారు. అర్చకులు ఏ సలహా ఇచ్చినా తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. 
 
కరోనా వైరస్ బారినపడి కోలుకున్న అర్చకుల్లో చాలా మంది ఆలయ విధులకు హాజరవుతున్నారని, అయితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అర్చకులకు తిరుమలలో విధులు ఇవ్వవద్దని ప్రధాన అర్చకులకు చెప్పామని ఈవో వెల్లడించారు. దర్శనాల కోసం అర్చకులను ఇబ్బందులకు గురిచేయాలన్న ఆలోచన టీటీడీకి లేదని స్పష్టం చేశారు.
 
ఇకపోతే, తిరుమల క్షేత్రంలో కరోనా గురించి చెబుతూ, ఇప్పటివరకు 743 మందికి కరోనా సోకినట్టు తేలిందని, వారిలో 400 మంది కోలుకున్నారని తెలిపారు. ఐదుగురు టీటీడీ ఉద్యోగులు కరోనా కారణంగా మరణించారని సింఘాల్ వివరించారు. తిరుమల కొండపై కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గట్టి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నిరంతర తనిఖీలు, పారిశుద్ధ్య పనులను కొనసాగిస్తున్నట్టు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు