భారతీయ మహిళలు తమ ముఖానికి, పాపిటలో కుంకమను పెట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా ఉపయోగిస్తారు. పండగలు, ఉత్సవాలు జరిగినప్పుడు ఒకరి మీద ఒకరు చల్లుకుంటారన్న సంగతి తెలిసిందే.
అయితే, కుంకుమ, సింధూరంలో సీసం స్థాయి ప్రమాదకర రీతిలో ఉంటోందని అమెరికాలోని రాట్జర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. అధిక మోతాదులో ఉండే సీసం వల్ల పిల్లల్లో ఐక్యూ లెవల్స్ పడిపోయి, ఎదుగుదల ఆలస్యం అవుతోందన్నారు.
అమెరికాలో సేకరించిన 83 శాతం, భారత్‌లో సేకరించిన 78 శాతం కుంకుమ నమూనాల్లో ఒక గ్రాములో 1.0 మైక్రోగామ్ సీసం ఉందన్నారు. న్యూజెర్సీలో 19 శాతం, భారత్‌లోని 43 శాతం నమూనాల్లో ఒక గ్రాముకు 20 మైక్రో గ్రాములు సీసం ఉందని కనుగొన్నారు. ఇది అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) నిర్దేశించిన పరిమితి కన్నా చాలా ఎక్కువని పేర్కొన్నారు.
దీనిపై విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డెరెక్ షెండెల్ మాట్లాడుతూ.. శరీరంపై భారీ లోహాల పొడులు పడితే మూత్రపిండాలు, కాలేయ, చర్మ వ్యాధులకు దారితీస్తాయని తెలిపారు. జన్యు విధ్వంసం, చర్మానికి పుళ్లు పడడం, గోర్లు, దంతాలు పాడవుతాయని వెల్లడించారు.
భారత్, పాకిస్థాన్, తూర్పు, మధ్య, దక్షిణాసియా దేశాల్లో ఈ సమస్యలు ఎక్కువ ఉంటాయి. తక్కువ నాణ్యత కలిగిన కాస్మొటిక్స్‌లో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం, జింక్ లోహాలు ఎక్కువ ఉంటాయి. చిన్నారులను వీటికి దూరంగా ఉంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు.