ఆధ్యాత్మిక అనుభూతినిచ్చే ఋషికేష్ పర్యటన

WD
ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం హిమాలయాలు. అనేక పుణ్యక్షేత్రాలు హిమాలయ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఋషికేష్. ఉత్తరాంచల్ రాష్ట్రంలోని తెహ్రి, ఘర్వాల్ ప్రదేశంలోని ఋషికేష్ పుణ్యక్షేత్రం. ఇక్కడ అనేక ఆశ్రమాలున్నాయి. ఆ ఆశ్రమాలలో ఉండే సాధువులు, పక్కనే ప్రవహించే గంగానదికి వారు చేసే పూజలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.

ఋషికేష్ నేడు అంతర్జాతీయ ఖ్యాతి వహించిన ఆధ్యాత్మిక కేంద్రం. యోగ, ధ్యానంకోసం ఇక్కడికి వస్తారు. సాహస క్రీడలకు ఋషికేష్ వచ్చేవారున్నారు. హిమాలయాలనుండి జరజరా కిందికి దిగివస్తున్న గంగానది ప్రవాహవేగం అధికంగా ఉంటుంది ఇక్కడ. అటువంటి గంగానది ఒడిమీద తేలుతూ వెళ్లడమనేది ఒక క్రీడ. ఎముకలు కొరికే చలిలో ఆ నీటిమీద రాఫ్టింగ్ చేయడం ఒక సాహసంతో కూడిన అనుభవం.

పలు విభాగాల యోగాలను ఇక్కడ నేర్చుకోవచ్చు. ఆరోగ్యం కోసం యోగా అనే సూత్రాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన గురువులు ఇక్కడ ఉన్నారు. ఋషికేస్ లో వేకువ జామున లేవాల్సిందే. అప్పటికే యోగా కేంద్రాలన్నింటిలో దినచర్య మొదలై ఉంటుంది. మరోవైపు గంగానదికి భక్తిభావంతో హారతులిస్తుంటారు.

ఆధ్యాత్మిక చింతన అస్సలు లేనివారు ఋషికేష్‌ని ఎంచుకోవద్దు. అడుగడుగునా హిందూ దేవతామూర్తులు కనిపించే వాతావరణం, భగవన్నామస్మరణతో తేలియాడే ప్రదేశం ఇది. విదేశీయులు తమ మతం మరచి అక్కడి ఆధ్యాత్మిక అనుభవం ఆస్వాదిస్తారు. ఆ స్థాయి మనస్తత్వం లేనివారు ఋషికేష్‌కు వెళ్లకపోవడమే మంచిది. పైగా మాంసాహారం నిషిద్ద ప్రదేశం ఇది. మత్తుపానీయాలకు తావు లేదు. కేవలం వినోదం కోరుకునే జంటలు దూరంగా ఉండాల్సిన ప్రదేశం ఋషికేష్.

ఢిల్లీ నుంచి బస్సు, రైలు ప్రయాణం చేసి డెహ్రాడూన్ చేరవచ్చు. డెహ్రాడూన్ కి విమాన సౌకర్యం కూడా ఉంది. మరింకెందుకాలస్యం.. ఆ ఆధ్యాత్మిక అనుభూతిని మీరు పొందండి.

వెబ్దునియా పై చదవండి