నాకోసం ఒక్క అడుగు ముందుకు వేయండి..!!

సోమవారం, 18 జులై 2011 (19:13 IST)
WD
''నా కోసం ఒక్క అడుగు వేయి.. మీకోసం వంద అడుగులు వేస్తా.. మీ వెంట నేనుంటా..'' అనే మాట వింటే షిర్డీసాయిబాబా గుర్తుకువస్తారు. అసలు ఒక్కఅడుగు ఎందుకు వేయాలి? 'తప్పు తప్పు... అలా అనకూడదని నా స్నేహితులు నన్ను వారించారు. ఆల్‌రెడీ కృష్ణుడు, రాముడు, జీసెస్‌ వీళ్ళంతా దేవుళ్లే కదా... వారంతా ఉండగా షిర్డీసాయినే ఎందుకు దర్శించాలి..? అని మళ్ళీ వాదించాను. వాళ్ళంతా.. వారిలాగే సాయి కూడా ఓ దేవదూత.. ఎన్నో మహిమలు చేశాడు. ఎంతోమంది జీవితాల్లో ధైర్యాన్ని నింపాడు అంటూ.. ఊరినే మార్చేశాడు. మరెందరికో జీవిత పరమార్థాన్ని బోధించాడు... అంటూ.. వారు నాకు రకరకాల కథలు చెప్పారు. చివరికి ఇలాంటివారే.. అనుకోకుండా ఆ ఒక్క అడుగు వేస్తాడు చూడు.. అంటూ స్నేహితుల్లో ఒకరు వ్యాఖ్యానించారు...

ఏ ఉద్దేశ్యంతో అన్నాడో కానీ... అలాంటి అడుగు వేయాల్సి వచ్చింది. అనుకోకుండానే.. మా కొలీగ్‌ను వేసవిలో పిల్లలకు సెలవుకదా.. శ్రీశైలమో, తిరుమలనో వెళదాం.. ప్లాన్‌ చేయమంటే... అప్పటి నుంచి కుదరనేలేదు. అలా రోజులు గడిచాయి.. ఓరోజు అనుకోకుండా.. షిర్డీ వెళ్ళాలనుకుంటున్నాం. మా వాడికి మొక్కు ఉంది.. అంటూ వర్షాకాలంలో టూర్‌ ప్రోగ్రామ్‌ గురించి చెప్పాడు. జులై 7న వెళ్లాలనుకుంటున్నామన్నాడు. సరేలే.. వెళ్ళిరండి అంటూ.. వేసవిలో పెడితే ఇంకా బాగుండేది కదా..అన్నాను.. ఇది జరిగి 10 రోజులయింది. షిర్డీకి వెళ్ళడానికి సిద్ధమయి ఉంటారనుకున్నా.. చూచాయిగా.. ఏంటీ ఎంతవరకు వచ్చింది. మీ ప్రోగ్రామ్‌ అని ఓ రోజు అడిగాను.

ఇంకా టికెట్లు బుక్‌ చేయలేదు.. అన్నారు. ట్రెయినా? బస్సుకా...? అని అడిగాను. ట్రెయిన్‌ అయితే కాస్త రిస్క్‌ చేయాలి... అది మహారాష్ట్రలో షిర్డీని దాటి వెళ్లి మళ్ళీ వెనక్కు వస్తుంది. కానీ షిర్డీలో ఆగదు. దూరంగా ఓచోట ఆగుతుంది. అక్కడ నుంచి బోల్డన్ని కారులు, సుమోలతో ట్రావెల్స్‌ వారు రెడీగా ఉంటారని చెప్పాడు. అదే బస్సు ప్రయాణమైతే.. హైదరాబాద్‌ నుంచి చాలా ఈజీ... డైరెక్ట్‌గా గుడికి వెళ్ళవచ్చు అని చెప్పాడు. ఓహో.. ఇంకా టికెట్‌ బుక్‌ చేయలేదు కాబట్టి.. నేను కూడా ఫ్యామిలీతో వెళితే బాగుంటుందని.. ఆలోచన ఠక్కున వచ్చింది.

సరే.. మూడు టిక్కెట్లు నాక్కూడా బుక్‌ చేయడండని చెప్పాను. ముగ్గురికీ రానుపోనూ 3470/- రూపాయలు.. తీసుకున్నాడు. అలా ప్రయాణం మొదలైంది. 7వ తేదీ గురువారం నాడు సాయంత్రం 5గంటలకు ఇమ్లిబన్‌ బస్టాండ్‌కు వెళ్ళాలి. దానికోసం ఇంటి నుంచి సాయంత్రం 3.30 గంటలకు బయలుదేరి- పక్కనే బస్టాప్‌లో బస్‌కోసం వెయిట్‌ చేశాం. దాదాపు 45 నిముషాలు ఎదురు చూసినా ఒక్కబస్సు కూడా రాలేదు.

ఈలోగా జనాలు పెరిగిపోయారు. వచ్చిన రెండు బస్సులూ ఫుట్‌బోర్డుపై వేలాడుతున్నారు. ఒక పక్కన మా కొలీగ్‌కు టెన్షన్‌ పట్టుకుంది. ఆటోలు కూడా పెద్దగా లేవు. అటునుంచి ఇటునుంచి వస్తున్న ఆటోలన్నీ ఫుల్‌గా ఉన్నాయి. అంతకుముందు రోజే తెలంగాణబంద్‌ జరిగింది. దీంతో ఈరోజు కూడా ఏదో గడబిడ జరుగుతుందనుకుని ఏం చేయాలా..? అంటూ.. కాసేపు అటూ ఇటూ టెన్షన్‌గా తిరిగాడు. ఎందుకంటే.. గత ఏడాది ఇలానే మా కొలీగ్‌ ప్రయాణమైతే... తెలంగాణా బంద్‌తో టూర్‌ కాన్సిల్‌ అయింది. అది గుర్తుచేశాడు.

'ఎందుకుసార్‌.. షిర్డీసాయిని తలచుకుని ఒక్క అడుగు... అంటూ అనుకోండని..' కాస్త నవ్వుతూ చెప్పాను. ఆయన నావంక కాస్త సీరియస్‌గా చూసి... మీకు జోకులుగా ఉంటుందండీ.. అంటూ అంటుండగా.... ఎటువైపు నుంచి వచ్చాడో ఆటోవాడు. ఠక్కున మా దగ్గరకువచ్చి... ఎక్కడికి సార్‌! అన్నాడు... హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని.. ఇమ్లిబిన్‌... అన్నాం... దాంతోబాటు మరో ఆటోకూడా వచ్చింది... రెండో ఆటోలో ఫ్యామిలీతో వెళ్ళాం. మేం ఎక్కిన ఆటోవాడి మీటర్‌ పనిచేయడం లేదని తాపీగా చెప్పాడు. క్రాస్‌రోడ్‌ నుంచి 80 రూపాయలవుతుందన్నాడు. సరే... 'దొంగనోటయితే 100 ఇస్తా.. మంచి నోటయితే 60 ఇస్తా.. ఏం కావాలో చెప్పు అన్నాను ఆటపట్టిస్తూ. అతను కాస్త ఆశ్చర్యంగా చూసి. ఆటో పోనిచ్చాడు. అలా 4.30 గంటలకు ఇమ్లిబిన్‌ చేరాం.

టిక్కెట్‌లో ఫ్లాట్‌ఫాం నెంబర్‌ 65.. బస్‌నెం. 1439 అని ఉంది. అంతా వెతికినా ఫ్లాట్‌ఫాం 56 తర్వాత మిగిలిన నెంబర్లు కన్పించలేదు.. ఆఖరికి ఫ్లాట్‌ఫాం నెంబర్‌ 47లోనే షిర్డీ బస్సు ఆగి ఉంది. అప్పుడే కండక్టర్‌ టిక్కెట్లు చెక్‌ చేస్తున్నాడు. ఇదేమిటి సార్‌.. నెంబర్‌ ఒకచోట. బస్సు ఒకచోట అని అడిగితే. నవ్వుతూ... అది అంతేసార్‌. వారు ఏదో రాస్తారు.. అంటూ ఇది మామూలే అన్నట్లు చెప్పాడు. తీరా బస్సు ఎక్కి కూర్చొంటే.. పేరుకు సూపర్‌లగ్జరీ... కానీ.. కిటికీలు తెరుచుకోవడలేదు. అడిగితే.. స్టక్‌ అయిపోయాయ్‌ సార్... అన్నాడు.

ఎదురుగా టీవీ కూడా లేదు. మా టెన్షన్‌కు తగినట్లే... టీవీ బాక్స్‌ 'నీకు టీవీ కావాలా?' అంటూ వెక్కిరిస్తున్నట్లుంది. అపరిచితుడులో లాగా టిక్కెట్లో అన్ని సౌకర్యాలతో డబ్బు తీసుకున్నారు గదా.. అని అడిగితే... 'మమ్మల్ని ఏం చేయమంటారు సార్‌... టీవీ కాంట్రాక్టర్‌ టైమ్‌ అయిపోయింది. టెండర్లు వేసి పిలిస్తే కొత్తవాడు రావాలి..అంటూ ఆయన డిపార్ట్‌మెంట్‌ బాధలు చెప్పుకొచ్చారు. అంటే 15గంటల జర్నీ.. ఇలా బోర్‌గా చేయాలా? అని నిలదీస్తే... జి.ఎంకు చెప్పుకోండని ఫోన్‌ నెంబర్‌ ఇచ్చాడు. నాతోపాటు కొందరు వాయిస్‌ కలిపినా.. మా కొలీగ్‌.. ఎందుకులెండి... రాత్రి నిద్రపోతే హాయిగా తెల్లారి దేవుడి దర్శనం చేసుకోవచ్చని చెప్పాడు. అలా 5 గంటలకు బయలుదేరి... హైదరాబాద్‌ సిటీలో బిహెచ్ఇఎల్‌ను దాటేసరికి 7.45 నిముషాలయింది. ఇక్కడే ఇంత టైమ్‌ బడితే.. ఇంకా షీర్డి వెళ్ళేసరికి ఎంత పడుతుందో అనిపించింది.

అలా హైవేలోకి వచ్చేసరికి ట్రాఫిక్‌ పెద్దగా లేదు... అలాసాగిపోతుంది బస్‌లో మనసు కుదుటపడటంతో కునుకు తీశాను. 'ఆ దిగండి.. 10నిముషాలు.. లంచ్‌బ్రేక్‌.. (రాత్రి కాబట్టి డిన్నర్‌ అనాలి) 'అంటూ కండక్టర్‌ కేకతో మెలకువ వచ్చింది. చూస్తే రాత్రి 9.15గం అయింది. జహీరాబాద్‌ ఆర్‌టిసి అని రాసి ఉంది.

హోటల్‌లోకి వెళ్ళి వివరాలు అడిగితే... సప్లయిర్లు వస్తారని చెప్పాడు క్యాషియర్‌. అలా ఆరుగురం కూర్చుని 10 రోటీ, 2 పాలక్‌పన్నీర్‌, రెండు వెజ్‌ బిర్యానీ ఆర్డర్‌ ఇచ్చాం. మాంచి ఆకలిమీద ఉన్నాం కాబట్టి తినేశాం. కానీ టేస్ట్‌ బాగోలేదని మా కొలీగ్‌ సగంలో వదిలేశాడు. అదే పరిస్థితి బస్సులో దిగినవారిలో కొంతమందిది. ఇక బిల్‌ చూసేసరికి మైండ్ మొద్దుబారింది. రూ 545/- అన్నాడు. ఇదేమిటయ్యా.. రేట్లు కూడా పెట్టకుండా ఇంత ఇదిగా రేటు వేస్తారా? అంటే... ఇక్కడ ఇంతేనని సమాధానం ఇచ్చాడతను. ఆ బిల్లు కట్టేసి బయటకు వచ్చాం. అప్పటికే కొందరు ప్రయాణీకులు కండక్టరు, డ్రైవర్‌తో 'పదార్థాలు ఏమీ బాగోలేదు. ప్యాసింజర్లను దోపిడీ చేస్తున్నారు. మీకు ఉచితంగా భోజనం వస్తుందని మమ్మల్ని బలిచేస్తారా? బయట ధాబాలో ఆపితే బాగుండేదని అంటూ నిలదీస్తున్నారు. మేమూ వంతపాడాం. దాంతో అతడు మళ్లీ... మీకు ఏ కంప్లయిట్‌ వచ్చినా జి.ఎం. నెంబర్‌ బస్సులో అంటించి వున్న స్టిక్కర్‌ చూపించి నెంబర్‌ ఇచ్చాడు.. తీరా దానికి ట్రై చేస్తే స్విచాఫ్‌ అనివస్తుంది. రెండు నెంబర్లూ అదేపరిస్థితి.

తప్పుడు నెంబర్‌ ఇచ్చావని అడిగితే.. రాత్రిపూట సార్‌. వారు ఆన్‌ చేయరని.. తాపీగా చెప్పాడు. అలా ఆ రాత్రి ప్రయాణం సాగింది. ఆటోమెటిక్‌గా నిద్రపోయాం. ఒక్కసారి చలిగాలి వేయడంతో.. లేచి పక్కనే కిటికీలో నుంచి చూస్తే... బయట వర్షం బాగా పడుతోంది. తెలతెలవారుజామున.. ఇంకా చీకటి.. వదల్లేదు. వెలుగు రాలేదు. మధ్యస్తంగా ఉన్న వాతారణంలో.. హిందీ అక్షరాలు పలు షాపుల్లో కన్పించాయి. అహ్మద్‌నగర్‌ అదే చూచాయిగా కన్పించింది. అంటే దగ్గరగా వచ్చేశాం అనిపించింది.

ఆ తర్వాత బస్సు ప్రయాణించి... 9 గంటలకు షిర్డీ బస్‌స్టాండ్‌కు చేరింది. లగేజీ సర్దుకుంటుండగా... బస్సులోకి కొంతమంది కుర్రాళ్ళు వచ్చి.. చేతిలో ఏవో చీటీలు పెడుతున్నారు.. కొంతమంది తీసుకున్నారు.. బస్సు దిగుతుండగానే... ఆటోవాలాలు చుట్టుముట్టారు... 'క్యా జానా హై..' అంటూ వెంటబడ్డారు. ఎక్కడికి వెళ్ళాలనేది మా కొలీగ్‌కు ప్లాన్‌ ఉండటంతో... ఫలానా చోట 'సైకిల్‌ స్వామి ఆశ్రమం' అన్నాడు. ఆటోవాలా 40 రూపాయలు అడిగాడు.. సరేలే అని రెండు ఆటోల్లో వెళ్ళాం. తీరా అక్కడికి వెళితే.. అది 5 అంతస్తుల బిల్డింగ్. ఆశ్రమం అన్నారుగదా. అంటే.. ఇదే... ఒకప్పుడు విశాలంగా చెట్లుండేవి, కానీ.. భక్తుల రద్దీతో ఇలా అంతస్తులు కట్టి రూమ్‌లు అద్దెకిస్తుంటారని చెప్పాడు. మరి బస్సులో ఏవో స్లిప్పులు ఇచ్చారేమిటని అడిగాను. అవి లాడ్జివాళ్ళు ఏర్పాటు చేసిన ఏజెంట్లు ఇచ్చినవి. వారి స్లిప్ తీసుకుంటే మనవెంట పడతారు. అంటూ మా కొలీగ్‌ చెప్పాడు.
నా యాత్ర అనుభవం రేపు మరికొంచెం...

వెబ్దునియా పై చదవండి