సతీదేవి ఆరాధ్య దేవతగా వెలసిన "కాళీఘాట్"

FILE
దక్షయజ్ఞం సమయంలో అవమాన భారాన్ని భరించలేని సతీదేవి అగ్నికి ఆహుతవుతుంది. సతీదేవి కళేబరాన్ని భుజంపై వేసుకున్న శంకరుడు రుద్రమూర్తియై ప్రళయ తాండవం చేస్తాడు. ఆ సమయంలో శంకరుడి తాండవం వేగానికి తట్టుకోలేని సతీదేవి శరీర భాగాలు 52 ప్రదేశాలలో పడి అవి ప్రసిద్ధ శక్తి పీఠాలుగా పేరుగాంచాయి. అలా సతీదేవి కుడికాలి బొటనవ్రేలు భాగం పడిన ప్రదేశమే "కాళీఘాట్".

మరో కథనం ప్రకారం.. ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడుగానీ.. కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి..? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని) తోడుగా దర్శనమిస్తుంది.
విశాలమైన త్రినేత్రాలతో...!
విశాలమైన త్రినేత్రాలతో, పొడవైన బంగారు నాలుకతో, నాలుగు చేతులతో అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో తెగిన తలను ధరించిన అమ్మవారు అభయ వరద ముద్రలతో కనువిందు చేస్తుంటారు. మోక్షాన్ని కోరే మానవుడు తనలోని అహంకారాన్ని వదిలితే కాళీమాత అభయాన్ని


అలా భారతదేశపు ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటిగా, కలకత్తా కాళీమాతగా.. బెంగాల్ ప్రజలకు ఆరాధ్య దేవతయై నిత్యపూజలందుకుంటున్న "కాళీఘాట్" ఆలయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని.. హుగ్లీ నదీ తీరంలో విలసిల్లుతోంది. కాళీఘాట్ వల్లనే కలకత్తా నగరానికి ఆ పేరు వచ్చినట్లుగా చెబుతుంటారు. ఇంకా ఇక్కడ సహస్త్ర భుజకాళీ, సర్వమంగళ, తారాసుందరి, సింహవాహిని ఆలయాలున్నాయి. కాళీరూపం భయంకరమైనదే అయినప్పటికీ.. ఆ మాత దుష్ట సంహారానికి, శిష్టజన రక్షణకు పేరుగాంచారు.

అతిపురాతమైన కాళీఘాట్ ఆలయ స్థల చరిత్రను చూస్తే... గతంలో భగీరథీ నది (హుగ్లీ) సమీపం నుంచి ఒక తీక్షణమైన కాంతిపుంజం రావటం గమనించిన ప్రజలు.. ఆ కాంతి బొటనవ్రేలు ఆకారంలోగల ఒక శిల నుంచి వస్తుండటాన్ని గుర్తించారు. వెంటనే ఆ అడవిలో వెలసిన కాళికాదేవి ఆరాధించసాగారు. అక్కడే నకులేశ్వర భైరవ స్వయంభు లింగాన్ని కూడా కనుగొన్నారు. తరువాత సబర్నరావ్ చౌదరి కుటుంబం ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు. చిత్‌పూర్‌లో సైతం ఈ కుటుంబం చిత్రేశ్వర కాళికాలయాన్ని నిర్మించారు.

కాళీఘాట్ ఆలయాన్ని 16వ శతాబ్దంలో మాన్‌సింగ్ రాజు నిర్మించాడు. బనీసా ప్రాంతానికి చెందిన సబర్నరావ్ చౌదరీ ఆలయ అభివృద్ధికి తోడ్పడటంతో 1809 నాటికి ఆలయ నిర్మాణం పూర్తయినట్లుగా తెలుస్తోంది. ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న నట్‌మందిర్ మండపాన్ని.. 1835లో జమిందార్‌ కాశీనాథ్‌రావ్ నిర్మించారు. ఆ తరువాత 1960వ సంవత్సరంలో వివాదాలతో నడుస్తున్న ఈ ఆలయం ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. అప్పట్నించీ హల్దార్ వంశీయులు ఆలయ పూజాదికాలను నిర్వహిస్తున్నారు.

FILE
బెంగాల్‌లో ఉన్న ఇతర కాళీకాదేవి విగ్రహాలకు భిన్నంగా కాళీఘాట్ అమ్మవారి విగ్రహం ఉంటుంది. విశాలమైన త్రినేత్రాలతో, పొడవైన బంగారు నాలుకతో, నాలుగు చేతులతో అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో తెగిన తలను ధరించిన అమ్మవారు అభయ వరద ముద్రలతో కనువిందు చేస్తుంటారు. మోక్షాన్ని కోరే మానవుడు తనలోని అహంకారాన్ని వదిలితే కాళీమాత అభయాన్ని ప్రసాదించి కటాక్షిందనేందుకు ఈ విగ్రహం మనకు నిదర్శనంగా కనిపిస్తుంటుంది.

ఆలయంలోని జోర్ బంగ్లా విశాలమైన ప్రాంగణంతో అలరారుతుంటుంది. ఈ వరండా నుంచి అమ్మవారి ఆలయం, నట్ మందిర్ మండపం కనిపిస్తూ ఉంటాయి. శోస్తితాలా పీఠంపై.. శోస్తి, శితోలా, మొంగోల్‌ఛండీ అమ్మవారి రూపాలు శిలల రూపంలో దర్శనమిస్తుంటాయి. 1880లో గోవిందదాస్ మొండాల్ దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడ పూజారిణులు ఉండటం విశేషం కాగా.. అర్చనలు, నైవేద్యాలు అసలు ఉండనే ఉండవు. ఇక్కడి శిలా రూపాలను కాళీ రూపంగా ఆరాధిస్తుంటారు.

ఇక్కడి రాధాకృష్ణుల ఆలయాన్ని శ్యామోరే ఆలయంగా పిలుస్తుంటారు. ప్రధాన ఆలయానికి దక్షిణ భాగంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారి నివేదనలకు విడిగా పాకశాల కూడా ఉంది. ప్రధాన ఆలయ ప్రాంగణానికి వెలుపల ఆజ్ఞేయ భాగంలో కుందుపుకూర్ తీర్థం ఉంటుంది. గతంలో దీన్నే కాకుండ్‌గా పిలిచేవారట. ఈ ప్రదేశం నుంచే సతీదేవి శరీర భాగాన్ని కనుగొన్నట్లు చెబుతుంటారు. ఇక్కడి జలాలలను గంగానది జలమంత పవిత్రంగా భావిస్తుంటారు.

ఇక్కడి నకులేశ్వ మహదేవ ఆలయంలోని స్వామివారు స్వయంభువు. నకులేశ్వరుని కాళికాదేవి పతిగా భావించి ప్రజలు పూజలు చేస్తుంటారు. ఆలయ ప్రాంగణంలోని పోలీస్ స్టేషన్‌కు వెనుకనుండే హల్దార్‌పాకా మార్గంలో ఈ ప్రాచీన ఆలయం ఉంది. ఇక్కడే మరో నాలుగు శివాలయాలు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. కాళీఘాట్ ఆలయంలోని కాళీమాతకు నవరాత్రి వేడుకల్లో భాగంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఈ రోజుల్లో కాళీఘాట్‌ కాళీమాత సందర్శనతో అందరికీ ఆ తల్లి అభయం ఉంటుందని భక్తులు విశ్వసిస్తుంటారు. మరెందుకు ఆలస్యం ఆ తల్లి చల్లని చూపు మనమీద కూడా ఉండాలని అమ్మవారిని దర్శించి, ప్రార్థించుకుందా రండి..!!

వెబ్దునియా పై చదవండి