2011 తెలంగాణా వాదం: సమైక్య తెరలు తొలగిపోతున్నాయా..?!!

శనివారం, 31 డిశెంబరు 2011 (15:01 IST)
2009 - 10 మధ్య కాలంలో తెలంగాణపై ససేమిరా అన్న నాయకులు మెల్లిగా తమ స్వరాన్ని మార్చుకుంటున్నట్లు కనబడుతోంది. 2011 చివరాఖరికి వచ్చేసరికి క్రమంగా సమైక్య తెరలను తొలగించుకుని తెలంగాణా సాధించుకోండి.. మీ వెనుక నేనుంటా.. అన్నట్లుగా నాయకుల ప్రవర్తన సాగుతోంది.

ముఖ్యంగా ప్రధానప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో తెలంగాణలో రైతుపోరుబాట పట్టారు. తెలంగాణలో ఆయన పర్యటించిన చోట్లలో బాగానే స్పందన వచ్చింది. మరోవైపు కొన్నిచోట్లు ఆయనపైకి కోడిగుడ్లు, టమోటాలు దూసుక వచ్చాయి. వీటిని అడ్డుకునేందుకో.. లేదంటే తన వైఖరిని తేటతెల్లం చేయాలని నిశ్చయించుకున్నారో కానీ తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని చెప్పేశారు.

అంతేకాదు.. వేదికపై ఎర్రబెల్లి, మోత్కుపల్లి నర్సింహులు ఇద్దరూ చంద్రబాబు నాయకత్వంలో తెలంగాణను సాధించుకుంటాం అని ప్రతిజ్ఞ చేశారు. అదే వేదికపై బాబు కూడా తెలంగాణ వద్దని తానెన్నడూ చెప్పలేదనీ, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీయే అస్థిరతకు కారణమైందని దుయ్యబట్టారు.

తమ్ముళ్లూ.. మీ వెనుక నేనుంటా.. పోరాడి తెలంగాణా తెచ్చుకోండి అని ధైర్యవచనాలు పలికారు. అలా తెలంగాణలో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బాబు యత్నం చేశారు. ఐతే ఆయన తెలంగాణ అనుకూల వైఖరిపై సీమాంధ్రలో ఎలాంటి స్పందన వస్తుందో 2012లోనో లేదంటా 2014 ఎన్నికల సమయంలోనూ చూడవచ్చు.

ఇకపోతే కొత్తగా పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండగా లోక్సభలో సమైక్య ప్లకార్డులను పట్టుకుని తన మద్దతు తెలిపిన జగన్ మోహన్ రెడ్డి, వచ్చే ఉపఎన్నికల్లో తెలంగాణ ప్రాంత అభ్యర్థులపై తమ పార్టీ పోటీ చేయదని ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా ఆయన తెలంగాణా అనుకూలవాదని అర్థం చేసుకోవచ్చు. ఇలా ఇద్దరు నాయకులు తెలంగాణపై తమ వైఖరిని మెల్లిగా బయటపెట్టేశారు.
FILE


ఇక మిగిలింది నాయకుల వ్యాఖ్యలపై సీమాంధ్రలో స్పందన ఎలా ఉండబోతుందన్నదే. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆనం వివేకానందరెడ్డి జగన్ మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. కేసీఆర్ వద్ద మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తెలంగాణాపై ద్వంద్వవైఖరిని అవలంభిస్తున్నారని మండిపడ్డారు. మొత్తమ్మీద తెలంగాణపై తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టతకు వచ్చేసినట్లే అనుకోవచ్చు. ఇక తెలంగాణ తేల్చుడే ఆలస్యం. మరి కేసీఆర్ తెలంగాణ తెచ్చుడులో సంక్రాంతి తర్వాత ఎలాంటి దంచుడు మొదలెడతారో చూడాలి.

వెబ్దునియా పై చదవండి