ఈ ఏడాది ఆసియా క్రికెట్‌కు దక్కిన మిశ్రమ ఫలితాలు!!

బుధవారం, 28 డిశెంబరు 2011 (10:37 IST)
ఆసియా క్రికెట్‌కు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. దాయాది దేశాలైన భారత్ - పాకిస్థాన్‌లకు మిశ్రమ ఫలితాలే వచ్చాయనే చెప్పాలి. 2011వ సంవత్సరం పాకిస్థాన్‌కు తీరని మచ్చగా నిలిచిపోయింది. ముగ్గురు పాకిస్థానీ క్రీడాకారులు స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో జైలు శిక్ష అనుభవించడం ద్వారా యావత్తు క్రికెట్ ప్రపంచం ముందు పాకిస్థాన్ తలదించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

అయితే భారత్‌కు మాత్రం ఈ ఏడాది కలిసొచ్చింది. ఏప్రిల్‌లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా ప్రపంచ కప్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. కానీ ఇంగ్లండ్ పర్యటనలో మాత్రం భారత్‌కు చేదు అనుభవమే మిగిలింది. కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం విచారణ జరపడంతో ద్వారా ఐపీఎల్ మూడు సీజన్లలో జరిగిన ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.

భారత్‌తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో శ్రీలంక ఓటమి పాలైంది. జూలై 2010 స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ 600 వికెట్ల రికార్డుతో కెరీర్‌కు స్వస్తి చెప్పిన తర్వాత శ్రీలంక ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా గెలుచుకోలేకపోవడం గమనార్హం. అయితే బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు ఈ ఏడాది మోస్తరుగా రాణించాయి.

ఇక నవంబరులో పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ‌తో పాటు బుకీ, మరో ఇద్దరు క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్‌ వ్యవహారంలో చిక్కుకుని జైలు పాలయ్యారు. వీరిలో 27 ఏళ్ల సల్మాన్ భట్‌కు 30 నెలలు, మొహమ్మద్ ఆసిఫ్ (28) ఒక ఏడాది, 19 ఏళ్ల అమీర్‌కు ఆరేళ్ల జైలు శిక్ష విధించారు. బ్రిటీష్ ఏజెంట్ మజర్ మజీద్‌కు రెండేళ్ల ఎనిమిది నెలల పాటు జైలు శిక్ష విధించారు.

అయితే శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో పాకిస్థాన్ అన్నీ ఫార్మెట్లలో మెరుగ్గా రాణించింది. దుబాయ్‌లో జరిగిన ఈ సిరీస్‌లో పాకిస్థాన్ పైచేయి సాధించింది. ఇక పాక్ ఆఫ్-స్పిన్నర్ సయ్యీద్ అజ్మల్ ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన క్రికెటర్‌గా నిలిచాడు. అలాగే వన్డే ఫార్మాట్‌లో పాకిస్థానీ బౌలర్లు షాహిద్ అఫ్రిది, అజ్మల్, హఫీజ్‌లు టాప్-6లో స్థానం దక్కించుకున్నారు.

ఇకపోతే.. 2012 కొత్త సంవత్సరంలో పాకిస్థాన్‌కు నిజమైన బలపరీక్ష ఎదురుకానుంది. యూఏఈ వేదికగా ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ మూడు టెస్టుల క్రికెట్ సిరీస్ ఆడనుంది. టీమిండియా సంగతికి వచ్చే.. వరల్డ్ కప్ గెలిచిన ఊపుతో ఇంగ్లండ్‌కు టీమిండియా వెళ్లినా ఇంగ్లండ్ 5-0 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. అయితే వెస్టిండీస్‌తో జరిగిన క్రికెట్ సిరీస్‌లో మాత్రం భారత్ రాణించింది.
ఇంగ్లండ్ టూర్‌లో ది వాల్ రాహుల్ ద్రావిడ్ మూడు సెంచరీలు నమోదు చేసుకున్నాడు. అలాగే ద్రవిడ్ వెయ్యి పరుగుల మైలురాయిని కూడా దాటాడు. అయితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాత్రం వందో శతకాన్ని ఇంకా పూర్తి చేసుకోలేకపోతున్నాడు. ఈ ఏడాది చివర్లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ టూర్‌లోనైనా సచిన్ వందో శతకం సాధిస్తాడా అనేది చర్చనీయాంశమైంది.

ఇంగ్లండ్‌తో ఓవల్ మైదానంలో జరిగిన టెస్టులో 91 పరుగులు, వెస్టిండీస్‌తో ముంబైలో జరిగిన టెస్టులోనూ 94 పరుగులు సాధించిన సచిన్ రెండుసార్లు వందో శతకాన్ని మిస్ చేసుకున్నాడు. ఇదే తరహాలో ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులోనూ సచిన్ టెండూల్కర్ 74 పరుగుల వద్ద పెవిలియన్ దారి పట్టాడు. తద్వారా మూడు సార్లు సచిన్ సెంచరీ చేజార్చుకున్నాడు. మొత్తం మీద ఈ యేడాది భారత్‌కు అచ్చొచ్చిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి