చేదు జ్ఞాపకాలు.. దూకుడు హిట్‌తో 2011కి గుడ్‌బై

గురువారం, 29 డిశెంబరు 2011 (12:51 IST)
WD
2011 సంవత్సరం టాలీవుడ్‌కి సింహభాగం చేదును కొసరు భాగం తీపిని రుచి చూపించి వీడ్కోలు తీసుకుంటోంది. టాలీవుడ్‌లో విడుదలైన సినిమాలకు తెలంగాణ ఉద్యమం చావుదెబ్బ తీయగా ఒకట్రెండు మాత్రం ఉవ్వెత్తున ఎగసి సూపర్‌డూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నాయి.

మహేష్ బాబు దూకుడు చిత్రం ఆల్‌టైమ్ రికార్డు సొంతం చేసుకుని టాలీవుడ్‌కు కొత్త ఊపిరి పోసింది. డబ్బింగ్ చిత్రాల హవాతో అతలాకుతలమవుతున్న టాలీవుడ్‌కు దూకుడు స్వాంతన చేకూర్చిందనె చెప్పాలి.

ఇక చేదువార్తల విషయానికి వస్తే.. ఈ ఏడాది ఆరంభంలోనే ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ మరణం టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రముఖ రచయిత బాపు రమణల కాంబినేషన్‌లోని ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ 'శ్రీరామరాజ్యం' షూటింగ్‌ జరుగుతుండగానే హఠన్మరణం చెందారు.

కవి, రచయిత, నిర్మాత, దర్శకుడు అయిన డా|| మల్లెమాల మరణవార్త టాలీవుడ్ తీరని లోటును మిగిల్చింది. ఆయన 'అంకుశం'తో సినిమారంగంలో కొత్త ఒరవడి సృష్టించి చివరిదశలో 'నా ఇష్టం' రచనతో ఇండస్ట్రీలో ఉన్న లుకలుకల్ని బయటి ప్రపంచానికి విప్పి చూపారు.

విలక్షణ నటునిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నూతన ప్రసాద్‌ మరణం కూడా ఈ ఏడాదే. ఇక రంగస్థలం నుంచి వచ్చిన నటుడు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి కూడా ఇటీవలే దూరమయ్యారు. అదేవిధంగా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సతీమణి దాసరి పద్మ ఇటీవలే మరణించారు. ఈ ఏడాది ముగియడానికి మరికొన్ని రోజులే ఉండగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ అనారోగ్యంతో కన్నుమూశారు.

వీరితోపాటు సంగీత దర్శకుడు అనిల్‌, రచయిత గంథం నాగరాజు, గీత రచయిత కులశేఖర్‌, దర్శకుడు వి.ఆర్‌. ప్రతాప్‌తోపాటు 24 శాఖలకు చెందిన పలువురు సినీ కార్మికులు కూడా ఈ ఏడాది కాలగర్భంలో కలిసిపోయారు. ఇలా 2011 సంవత్సరం టాలీవుడ్‌కు చేదునే ఎక్కువగా మిగిల్చి తీపిని కొద్దిగా రుచి చూపించి వీడ్కోలు తీసుకుంటోంది.

వెబ్దునియా పై చదవండి