ఐ టూ హ్యాడ్ ఏ లవ్ స్టోరీ

WD
"ఐ టూ హ్యాడ్ ఏ లవ్ స్టోరీ"... ఇది కథ కాదు. నిజ‌జీవితంలో జరిగిన సంఘటన. ఆన్‌లైన్ వివాహ వేదిక ద్వారా కలిసిన ఇద్దరి ప్రేమకథ. ఆ ఇద్దరు ప్రేమికులు.. రవీందర్‌సింగ్, ఖుషీ. 26 ఏళ్ల వయసు కలిగిన రవీందర్‌సింగ్ చండీఘర్ నివాసి. అతను పుట్టింది కోల్‌‍కతాలో... పెరిగింది ఒరిస్సాలో.

కర్నాటక‌లోని గురునానక్‌దేవ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తిచేసి చండీఘర్‌లోని ఇన్‌ఫోసిస్ టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్ ద్వారా పరిచయమైన ఖుషీ‌తో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది... సంభాషణలు మొదలయ్యాయి. ఒకరి భావాలు ఒకరు పంచుకున్నారు. పెళ్ళికూడా చేసుకోవాలనుకున్నారు.

ఎన్నో ప్రేమ జంటల పట్ల విధి చూపే చిన్నచూపే వీరి విషయంలోనూ జరిగింది. ప్రేమ వారి హృదయాలను కొల్లగొట్టింది. రాబోయే ఐదు రోజుల్లో నిశ్చితార్థం జరుగుతుందనగా భాగస్వామి కావలసిన ప్రియురాలు అందనంత దూరం వెళ్లిపోయింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లుగా మారింది పరిస్థితి.

హృదయాలను ద్రవింపజేసే ఈ యధార్థ సంఘటననే ఇతివృత్తంగా తీసుకుని రవీందర్ రచించినదే ఈ "ఐ టూ హ్యాడ్ ఏ లవ్ స్టోరీ". ఈ పుస్తకాన్ని షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ పుస్తకంలో ఓ ప్రేమికుడు తన ప్రేమను, బాధను వ్యక్తీకరించడం మనసుకు హత్తుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు.

రవీందర్ మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని తన ప్రియురాలికి అంకితమిస్తున్నట్లు తెలిపారు. జీవితాంతం నాతో గడపాల్సిన నా సఖి అర్ధాంతరంగా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా నేను ధైర్యం కోల్పోకుండా యధార్థ సంఘటనకు అక్షరరూపం ఇచ్చానని, ఈ పుస్తకం ద్వారా వచ్చే ఆదాయంతో ఇతరులకు సహాయపడతానని తెలిపారు.

ఈ పుస్తకాన్ని సృష్టి పబ్లికేషన్స్ వారు ప్రచురించారు, ధర రూ..100/- దేశంలోని ప్రముఖ పుస్తకాల షాపులలో దొరుకుతుంది.

వెబ్దునియా పై చదవండి