ఇకపై ప్రేమను కొనుక్కోవచ్చు...!

జేబు నిండా డబ్బుంటే చాలు ఇకపై ప్రేమను కొనుక్కోవచ్చు... అదే డబ్బుతో ప్రేమను వదిలించుకోనూవచ్చు... అదెలాగబ్బా.. అని ఆలోచిస్తున్నారా..! మరేం లేదండీ.. త్వరలోనే మార్కెట్‌లోకి ప్రేమ గుళికలు రాబోతున్నాయి. వీటిని చప్పరిస్తే చాలు అమాంతం ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది.

మరి ఈ ప్రేమకు విరుగుడెలా అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే.. ప్రేమ గుళిక లాగే, ప్రేమ విరుగుడు గుళిక కూడా ఉంది కాబట్టి.. ఇది వేసుకుంటే, ప్రేమపై వెగటు పుట్టేస్తుంది మరి..! అసలు ఈ ప్రేమ గుళిక, ప్రేమ విరుగుడు గుళికల కథా కమామీషేంటో ఇప్పుడు తెలుసుకుందాం...!

అసలు ప్రేమంటే ఒక మానసిక రసాయనిక ప్రక్రియ అని... మనిషి మెదడులో కదలికలను బట్టే ప్రేమ భావన కలుగుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రేమికులయ్యేందుకు దోహదపడే గుళికల తయారీ సాధ్యమేనని అమెరికాలోని అట్లాంటా ఎమొరి విశ్వవిద్యాలయానికి చెందిన మానసిక శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

అదే విధంగా ప్రేమభావం నుంచి బయట పడేందుకు కూడా గుళికలను తయారు చేయవచ్చునని వారు శాస్త్రీయంగా నిరూపించారు కూడా.. జీవ రసాయనిక ప్రక్రియలో భాగమే ప్రేమ కాబట్టి.. ఇతర ఉద్వేగాల లాగే ప్రేమ పుట్టించటం, తుంచేయటం సాధ్యమేనని వారు ఈ ప్రపంచానికి వెల్లడించారు.

వీరి పరిశోధనల్లో భాగంగా... కొన్ని రకాల ఎలుకలపై ఇలాంటి గుళికలను ప్రయోగించి ఫలితాలను పరిశీలించారు. ఎలుకల జంటపై జరిపిన ప్రయోగాల్లో వాటి లైంగిక బంధం ప్రభావితం అయినట్లు పరిశీలించామనీ.. తద్వారా ప్రేమ భావనకు దారితీసే మానసిక ప్రక్రియను కల్పించవచ్చుననీ లారీ యంగ్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు.

సో... వీలును బట్టి ప్రేమకు కామాలు, ఫుల్‌స్టాప్‌లు పెట్టుకునే రోజులు ముందు ముందు ఉండబోతున్నాయన్నమాట..!

వెబ్దునియా పై చదవండి