విదేశాలలో ఇంధన వనరులతో పొత్తు కోసం భారత్ ఇంతకాలం చేస్తూ వచ్చిన ప్రయత్నాలు పెద్దగా ఫలితాలను ఇవ్వకపోవడంతో భారతీయ చమురు కంపెనీలు తమ ఇంధన భద్రత కోసం ప్రపంచమంతటా గాలింపు ప్రారంభించాయి. ప్రపంచంలోనే అతి పెద్ద సహజ వాయు నిక్షేపాలున్న రష్యా, ఇరాన్లలో పట్టు సాధించడానికి భారత్ చేస్తూ వచ్చిన ప్రయత్నాలు విఫలమవుతూ వస్తున్నాయి
రష్యా ఇరాన్లలో భారతీయ కంపెనీలకు కేవలం ఒక చమురు, సహజవాయు మండలం మాత్రమే ఉందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. రష్యాలోని సఖాలిన్ 1 బ్లాక్‌లో ఓఎన్జిసి విదేశ్ లిమిటెడ్ 20శాతం వాటాను కలిగి ఉంది. ఇరాన్ లోన ఫార్సి బ్లాక్‌లో ఆయిల్ ఇండియా మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లు వాటాలు కలిగి ఉన్నాయి.
వీటి తర్వాత ఈ రెండు దేశాల్లో పలు ప్రాజెక్టుల్లో చేయి పెట్టాలని భారత్ ప్రయత్నించినప్పటికీ సఫలీకృతం కాలేకపోయింది. పాకిస్తాన్ గుండా ఇరాన్ నుంచి భారత్‌కు 7.2 బిలియన్ డాలర్ల పైప్‌లైన్ ప్రాజెక్టుకోసం భారత్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.
ఈ ఒప్పందం కుదిరి ఉంటే భారత్‌కు రోజుకు 60 మిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు పైప్‌లైన్ ద్వారా సరఫరా అయ్యేది. అలాగే సహజవాయు ధరవరలలో విభేదాల కారణంగా ఇరాన్ నుంచి ద్రవీకృత సహజవాయువుకోసం ఒప్పందం కూడా అటకెక్కింది.
భారత్ తన ముడి చమురు అవసరాల్లో 73 శాతాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది. దేశంలో డిమాండ్‌కు సగం మేరకు మాత్రమే సహజవాయు సరఫరా అవుతోంది. ఇంధన అన్వేషణల క్రమంలో చైనా బ్రహ్మాండంగా విజయాలు సాధిస్తుండగా ఇక్కడే భారత్ విఫలం కావడం గమనార్హం.
మొత్తం మీద భవిష్యత్ ఇంధన అవసరాల కోసం భారత్ కొనసాగిస్తున్న ప్రయత్నాలు ఇంకా దారిన పడలేదన్నదే వాస్తవం.