ఉదాత్త లక్షణాలకు నిలయం.. వీపీసింగ్

PNR

FileFILE
ప్రధాన రాజకీయ స్రవంతిలో పాల్గొని ఏనాడూ పదవులను అలంకరించని వారిలో లోహియా, సుందరయ్య, జయప్రకాష్ నారాయణ్‌లు అగ్రగణ్యులు. అయితే తన జీవిత కాలంలో ఎన్నో పదవులను అలంకరించి, దశాబ్దాల పాటు ప్రజా జీవిత అనుబంధం కలిగిన నేత మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. పదుల సంవత్సరాల పాటు కాంగ్రెస్‌ వాదిగా ఉన్నప్పటికీ నిబద్ధత, విధి, నిర్వహణ, త్యాగనిరతి, అంకితభావంలాంటి ఉదాత్త లక్షణాలకు నిలయంగా ఆయనకు పేరుంది.

దేశ సామాజిక పటాన్ని, రాజకీయాల గమనాన్ని సమూలంగా మార్చి వేసిన ఘనుడు. రాచకుటుంబంలో జన్మించిన సింగ్ జీవన శైలిలోగానీ, ప్రజా సంబంధాల్లో గానీ ఆ లక్షణాలు మచ్చుకైనా కనిపించవు. లాల్ బహుదూర్ శాస్త్రి శిష్యునిగా తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాలంలోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన సింగ్‌ రాజకీయ జీవితమంతా సంచనాలే. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన నేత.

ఇందిరా దృష్టిని ఆకర్షించిన ఘనుడు..
కేంద్రంలో డిప్యూటీ మంత్రిగా పని చేసిన సింగ్.. 1970 సంవత్సరంలో కాంగ్రెస్ ధీరవనిత ఇందిరాగాంధీ దృష్టిలో పడ్డారు. అలా పదేళ్ళ తర్వాత సింగ్‌ను 1980లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. బందిపోట్ల బెడదతో అట్టుడికి పోతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు తనకు తానుగా కాలపరిమితిని విధించుకున్నారు. కఠిన చట్టాలతో బందిపోట్లను ఏరిపారేశారు. అయితే.. ఈ ఏరివేతలో ఆయన పలువిమర్శలు సైతం ఎదుర్కొన్నారు. ఫలితంగా ఆయన సోదురుడుని కోల్పోయారు. దీంతో మనస్థాపం చెందిన సింగ్.. తన పదవికి రాజీనామా చేశారు.

నిజాయితీకి దక్కిన గుర్తింపు
ఈ కాలక్రమంలో వీపీసింగ్‌లోని నిజాయితీ, కార్యదక్షతలను ఇందిరాగాంధీ గుర్తించారు. వెంటనే ఆయనకు కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పించారు. రాజీవ్‌గాంధీ హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఆయన మంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత పన్ను ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపిన వైనం భారత చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ఫలితంగా ఆయన హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత పటిష్టంగా రూపుదిద్దుకుంది.

FileFILE
సింగ్ అనుసరించిన నిష్పక్షపాత వైఖరి, నిక్కచ్చితత్త్వం వల్ల పారిశ్రామికవర్గాల నుంచి ఒత్తిడికి తలొగ్గిన ప్రధాని రాజీవ్ గాంధీ.. ఆయన్ను రక్షణ శాఖ మంత్రిగా నియమించారు. వీరిద్దరి మధ్య భోఫోర్స్ కుంభకోణం విడదీసింది. ఫలితంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత జనమోర్చా.. 1988లో అలహాబాద్‌ చారిత్రాత్మక ఉప ఎన్నిక.. జనతాదళ్.. ప్రధానమంత్రి.. ఇలా అంచలంచెలుగా వీపీసింగ్ ఎదిగారు.

తాను ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చేసిన మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని నిర్ణయించినపుడు దానివల్ల కలిగే పర్యావసానాలను ఆయన ముందుగా ఊహించలేక పోయారు. అంతేకాకుండా తన ప్రభుత్వం గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో కూడా పదవిని కాపాడుకునేందుకు అడ్డదారులు తొక్కలేదు.

ముఖ్యంగా నాడు అద్వానీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని ఉంటే ఆయన ప్రభుత్వం కొనసాగేదే. మతోన్మాదాన్ని బహిరంగంగా ప్రోత్సహిస్తూ విషం గక్కుతున్న భాజపాతో చెలిమి లౌకిక వాదానికే గొడ్డలి పెట్టని సింగ్ భావించి, తన పదవిని త్యాగం చేశారు. లౌకివాదం, సామాజిక న్యాయం కలబోసి రూపుదిద్దుకున్న ఆయన సిద్ధాంతాన్ని, త్యాగనిరతిని యావత్ ప్రపంచం ప్రశంసించింది.

కొన్ని అనివార్య పరిస్థితుల్లో 1996 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వడాన్ని పలువురు పచ్చి అవకాశ వాదిగా ముద్రవేశారు. 1987-88 మధ్యకాలంలో సింగ్‌ను స్వామి ద్రోహిగా చిత్రీకరించారు. విమర్శలకు ఏ రాజకీయ నేత అతీతులు కాదు. అలాగే.. వీపీ.సింగ్‌ కూడా. అయితే ఆయన వ్యక్తిత్వంలో కొన్ని పార్శ్వాలు మాత్రం నేటికీ నిగూఢంగానే మిగిలి పోయాయి.

ఇలా దేశ చరిత్ర పుటల్లో తనకంటూ ఒక పేజీని ముద్రించుకున్న వీపీ సింగ్.. గత నెల 27వ తేదీన కన్నుమూశారు. ఆయనకు 77 సంవత్సరాలు. 1931 జూన్ 25వ తేదీన జన్మించిన సింగ్.. 1977 నుంచి బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతూ.. తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సీతాకుమారి, కుమారులు అజేయ సింగ్, అభేయ సింగ్‌లు ఉన్నారు. 'రాజా ఆఫ్ ముండా'గా ప్రసిద్ధుడైన సింగ్.. దేశ ప్రధానిగా 1989 డిసెంబరు రెండో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. 1990 నవంబరు పదో తేదీ వరకు పదవిలో కొనసాగారు.