ఎన్నికల నామ సంవత్సరం... '2008'

PNR

మంగళవారం, 30 డిశెంబరు 2008 (13:05 IST)
FileFILE
సంవత్సరం-2008. ఈ యేడాదికి దేశ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు లభించింది. దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో అధికార మార్పిడికి కేంద్ర బిందువుగా నిలిచింది. అందుకే ఈ యేడాదిని ఎన్నికల నామ సంవత్సరంగా పిలుస్తున్నారు. ఈశాన్య భారతం మొదలుకొని.. ఉత్తర, దక్షిణాదిల్లోని కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. ఇలాంటి వాటిలో కీలకమైనవి రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు. రెండు మూడు రాష్ట్రాల్లో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ అధికార మార్పిడి జరిగింది.

రాజస్థాన్‌ రాష్ట్రంలో భాజపా.. కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు అప్పగించింది. మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. కర్ణాటక ఎన్నికలు భాజపాకు దక్షిణ భారత ముఖద్వారంగా ఉపయోగడ్డాయి. తాజాగా జరిగిన జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. దీంతో మరోమారు హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే ఎన్సీ-కాంగ్రెస్ పార్టీలు సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తీరు తెన్నులను పరిశీలిస్తే..

ఈశాన్య రాష్ట్రాలతో ఆరంభం..
2008 సంవత్సరం ప్రారంభంలో మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఫిబ్రవరి 23వ తేదీన త్రిపుర అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 60 సీట్లు కలిగిన శాసనసభలో అధికార సీపీఎం పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది.

అలాగే 60 సీట్లు కలిగిన మేఘాలయ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పలేదు. మార్చి 3వ తేదీన జరిగిన ఎన్నికల్లో మేఘాలయ ప్రొగ్రసివ్ అలయన్స్ ఘన విజయం సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇకపోతే.. మార్చి 15వ తేదీన నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా, డెమొక్రటిక్ అలయన్స్ ఆఫ్ నాగాలాండ్ విజయం సాధించింది.

దక్షిణాది ముఖద్వారం..
ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రం కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలోని జేడీఎస్-కాంగ్రెస్ సర్కారు, జేడీఎస్-భాజపా సర్కార్ల మధ్య సఖ్యత లేమి కారణంగా కొద్ది కాలానికే కుప్పకూలాయి. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. మొత్తం 224 స్థానాలు కలిగిన శాసనసభకు మూడు దశల్లో ఎన్నికలు జరుగగా, కాంగ్రెస్, భాజపా, జేడీఎస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది.

త్రిముఖ పోటీలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఈ విజయం ఆ పార్టీకి దక్షిణ భారతంలో లభించిన తొలి విజయం కావడం గమనార్హం. మొత్తం 110 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపాను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.

మినీ సార్వత్రిక సమరం..
లోక్‌సభకు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నవంబర్-డిసెంబరు నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. వీటిని మినీ సార్వత్రిక సమరంగా అన్ని రాజకీయ పార్టీలు భావించాయి. ఆయా పార్టీల అధినేతలు రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఈ మినీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలుత ఎన్నికలు జరిగిన రాష్ట్రం ఛత్తీస్‌గఢ్. మొత్తం 90 సీట్లున్న అసెంబ్లీలో అధికార భాజపా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ రెండో సారి ప్రమాణ స్వీకారం చేశారు.

భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రెండో రాష్ట్రం మధ్యప్రదేశ్. మొత్తం 230 సీట్లు కలిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 27వ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఇందులో భాజాపా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత నవంబర్ 29వ తేదీన 69 సీట్లు కలిగిన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ సాధించింది. ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కమలనాథులు కన్న కలలు కలగానే మిగిలిపోయాయి. దీనికి తోడు తమకు గట్టిపట్టున్న రాజస్థాన్ అధికార పీఠాన్ని కూడా కోల్పోయారు. డిసెంబర్ 4వ తేదీన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విజయం కాంగ్రెస్ శ్రేణులకు మరింత ఉత్సాహం ఇవ్వగా, భాజపాకు మాత్రం గట్టి ఎదురుదెబ్బలాంటిది.

ఈ మినీ సార్వత్రికంలో ఎన్నికలు జరిగిన మరో ఈశాన్య రాష్ట్రం మిజోరం. డిసెంబరు రెండో తేదీన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుంధుభి మోగించింది. అధికార మిజోరం నేషనల్ ఫ్రంట్‌ను మట్టికరపించి, కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.

ఈ యేడాది చివరి ఎన్నికలు..
ఇకపోతే.. ఈ యేడాది చివరిగా ఎన్నికలు జరిగిన రాష్ట్రం జమ్మూకాశ్మీర్. గవర్నర్ పాలనలో ఉంటూ ఎన్నికలు ఎందుర్కొన్న రెండో రాష్ట్రం. అమర్‌నాథ్ ఆలయ భూముల వివాదం అధికార కాంగ్రెస్-పిడిపిల మధ్య చిచ్చుపెట్టింది. ఫలితంగా ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. దీంతో గవర్నర్ పాలన విధిస్తూ రాష్ట్రపతి ఆదేశాలిచ్చారు.

ఈ నేపథ్యంలో అసెంబ్లీకి ఏడు విడతలుగా ఎన్నికల జరిగాయి. ఈనెల 28వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగా, ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్పరెన్స్ 28 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇలా ఒకే ఏడాదిలో తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సంవత్సరంగా 2008 ఖ్యాతి గడించింది.

వెబ్దునియా పై చదవండి