బీజింగ్ ఒలింపిక్ క్రీడా సమరం... 2008

2008 ఆగస్టు 8న రాత్రి 8గంటల 8నిమిషాల 8 సెకన్లకు ఆరంభమైన బీజింగ్ ఒలింపిక్ సంబరం ఆగస్టు 24న ముగిసింది. అంగరంగ వైభవంగా బీజింగ్ ఒలింపిక్స్‌ను ప్రారంభించిన చైనా అంతే ఘనంగా ఈ క్రీడలను నిర్వహించింది. బీజింగ్ బర్డ్ నెస్ట్ స్టేడియంలో అశేష ప్రేక్షకుల మధ్య 16 రోజుల పాటు జరిగిన ఈ విశ్వ క్రీడల సంబరం కొన్ని విశేషాలు...

బీజింగ్ ఒలింపిక్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చైనా ఒలింపిక్ నిర్వహణకు మొత్తం 43 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. ఇందులో ఒక్కోరోజు వివిధ క్రీడాంశాలను నిర్వహించడానికి అయిన ఖర్చు దాదాపు 2.9 బిలియన్ డాలర్లు. అలాగే ఈ ఒలింపిక్ క్రీడలను కళ్లకు కట్టినట్టు క్రీడాభిమానుల ముంగిటకు చేర్చడానికి వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానానికి అయిన ఖర్చు అక్షరాలా 400 బిలియన్ డాలర్లు.

వీటితోపాటు ఒలింపిక్ క్రీడల నిర్వహణకు చైనా నిర్మించిన కొత్త స్టేడియాల కోసం దాదాపు 1.88 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. ఇంత ఖర్చుతో అంగరంగ వైభవంగా విశ్వ క్రీడలను నిర్వహించిన అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి స్పాన్సర్‌షిప్ రూపంలో లభించిన ఆదాయం ఎంతో తెలుసా... అక్షరాలా 74 మిలియన్ డాలర్లు.

ఇంత భారీ ఖర్చుతో నిర్వహించిన ఒలింపిక్ క్రీడలను అంతటి భారీ సంఖ్యలోనే క్రీడాభిమానులు వీక్షించారు. ప్రపంచ మొత్తం మీద వివిధ దేశాల్లోని 440 కోట్ల మంది ప్రజలు విశ్వ క్రీడలను వీక్షించినట్టు అంచనా. అంటే ప్రపంచ జనాభాలోని దాదాపు 66.6 శాతం మంది ఈ విశ్వ క్రీడలను తిలకించారన్న మాట.

ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వీక్షిస్తారు కాబట్టే ఒలింపిక్ క్రీడలను స్పాన్సర్ చేయడానికి వివిధ మల్టీ నేషనల్ కంపెనీలు ఎగబడుతుంటాయి. ఈ 2008లో చైనా నిర్వహించిన విశ్వ క్రీడలు విజయవంతం అవడంతో 2012లో ఇంగ్లండ్ మరెంత భారీగా విశ్వ క్రీడలను నిర్వహించనుందో అని ఇప్పటి నుంచే క్రీడాభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.

మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెబ్దునియా పై చదవండి