ధరలతో అతలాకుతలమైన 2009

గురువారం, 31 డిశెంబరు 2009 (12:35 IST)
FILE
ఇరవై ఒకటవ శతాబ్దంలోని తొమ్మిది సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి. 2009 ప్రారంభం నుంచి చివరి వరకు జరిగిన సంఘటనలను చూస్తే మంచి- చెడులు చాలానే జరిగాయి. వీటిలో ప్రధానంగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయనడంలో సందేహం లేదు.

సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ధరలు అదుపులో లేవు. నానాటికి ధరలు పెరుగుతూ పోయాయి. పైగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో అతలాకుతలమౌతున్న నేపథ్యంలో దేశంలో వివిధ వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కాని ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టైనా బాధ కలగలేదనడంలో సందేహం లేదు. నిత్యావసర సరుకుల నుండి నిత్యం మిలమిల మెరిసే బంగారం దాకా ధరలు భగభగమంటూనే ఉన్నాయి.

పసిపాపలు తాగే పాల నుంచి పప్పు దినుసులు, కూరగాయలు, వంట నూనె, బియ్యం, గోధుమలు, నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలొచ్చాయనడంలో సందేహం లేదు. నేనేం తక్కువా అన్న చందాన ప్రతి ఒక్క వస్తువు ధర ఆకాశాన్నంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నుంచి ధరలు పెరుగుతూనే పోయాయి.
FILE


ధరల పెరుగుదలలో 21వ శతాబ్దపు తొలి దశకంలో 2009 తొలి సంవత్సరంగా నమోదు చేసుకుంది. పెట్రోలు, డీజల్, కిరోసిన్, ఎల్‌పీజీ గ్యాస్ ధరలతోపాటు నిత్యావసర సరుకులైన గోధుమలు, బియ్యం, పండ్లు, కూరగాయలు, మసాలా దినుసులు, బంగాళాదుంపలు, తేనె, చక్కెర తదితర ఆహార పదార్థాల ధరలు సైతం ఆకాశాన్నంటాయి. కూరగాయల ధరలు ఆకాశాన్నంటడంతో అవి వంటగదిలో దర్శనమిచ్చే భాగ్యం కోల్పోయాయి.

దేశంలో నిత్యం వాడుకలో ఉండే కందిపప్పు ధరలు ఏకంగా కిలో వంద రూపాయలు పలకడంతో వారానికి ఒకసారి వాడటం జరుగుతోందని పలువురు గృహిణులు ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనలు కోకొల్లలు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టినా ధరలు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అదే మే, జూన్, జులై నెలల్లో వారాంతపు ద్రవ్యోల్బణం పెరుగుతూ పోయింది. దీంతో సాధారణ పౌరుని జేబుకు చిల్లులు పడ్డ మాట మాత్రం వాస్తవం.

FILE
జనవరి : నిత్యావసర సరుకుల ధరలు, జెట్ ఇంధనం, మద్యపానం ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ద్రవ్యోల్బణం వరుసగా రెండవ వారంలోను పెరిగి జనవరి 17తో ముగిసిన వారాంతానికి 5.64 శాతానికి చేరుకుంది. అంతకు మునుపు ముగిసిన వారాంతంలో 5.60 శాతంగానున్న ద్రవ్యోల్బణం 0.04 శాతం వృద్ధి జరిగింది.

ఫిబ్రవరి : జనవరి 31తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం ఒక్కసారి 0.68 శాతం తగ్గి ఒక సంవత్సరపు నిమ్నస్థాయికి చేరుకుని 4.39 శాతానికి పడిపోయింది. కాని నిత్యావసర సరుకుల ధరలు మాత్రం తగ్గలేదు.

ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, కర్మాగారాలలో ఉత్పత్తయ్యే వస్తువుల ధరలు తగ్గినా నిత్యావసర సరుకులు ధరలపై ఆధారపడ్డ ద్రవ్యోల్బణం ఫిబ్రవరి 14తో ముగిసిన వారాంతానికి 0.50 శాతం తగ్గి 3.36 శాతానికి చేరుకుంది. అదే గడచిన 15 నెలల క్రితానికున్న ద్రవ్యోల్బణానికన్నా తక్కువగానే ఉంది.
FILE


మార్చి : ఫిబ్రవరి 28తో ముగిసిన వారాంతానికి ధరలు తగ్గి 2.43 శాతానికి చేరుకుంది. అంతకు మునుపు ముగిసిన వారాంతంలో ఈ ద్రవ్యోల్బణం 3.03 శాతంగా ఉండింది. ఇది గడచిన ఏడు సంవత్సరాల క్రితంతో సమానంగా ఉండింది.

మార్చి 7 తో ముగిసిన వారాంతంలో ద్రవ్యోల్బణం భారీగా తగ్గి 0.44 శాతానికి చేరుకుంది. అయినప్పటికీ ఆహార పదార్థాల ధరలలో ఏ మాత్రం తగ్గుదల కనపడలేదు. ద్రవ్యోల్బణం భారీగా పతనమైనప్పటికీ ధాన్యం, పప్పు దినుసులతోపాటు అవసరమైన నిత్యావసర సరుకుల ధరలు గత సంవత్సరంలోని ఇదే నెలలో ముగిసిన వారాంతంలోనున్న ధరలకన్నా ఎక్కువే.

ఏప్రిల్ : రకరకాల ఆహార పదార్థాలు, తేయాకు, దిగుమతి చేసుకున్న వంట నూనె, బెల్లం మొదలైన నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణంలో మార్పు చోటు చేసుకుంది. దీంతో 21 మార్చ్ నాటికి ముగిసిన వారాంతంలో 0.04 శాతం వృద్ధి జరిగి 0.31 శాతానికి చేరుకుంది. ఇంతకు మునుపు వారాంతంలో ద్రవ్యోల్బణం 0.27 శాతంగా ఉండింది. ఇదే సందర్భంగా నిరుడు ఇదే కాలంలో 7.8 శాతంగా ఉండింది. అదే సాఫ్ట్ డ్రింక్, మసాలా దినుసులు, ఊరగాయలు తదితర ఆహార పదార్థాల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇందులో భాగంగా సోయాబీన్, వేరుశెనగ, పత్తి ధరల్లోను వృద్ధి జరిగింది.

మే : మే నెలలో ద్రవ్యోల్బణం 0.48 శాతం పెరిగి 0.61 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత వీటిలో పెద్దగా మార్పు లేదు.

జూన్ : జూన్ నెలలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి 0.48 శాతానికి చేరుకుంది. తర్వాత వరుసగా రెండు వారాలలో సున్న శాతంకన్నా తక్కువ స్థితికి చేరుకుంది.

జులై-ఆగస్టు : ఈ రెండు నెలల్లోను ద్రవ్యోల్బణం వరుసగా తగ్గుముఖం పట్టింది.

FILE
సెప్టెంబరు : వార్షికరీతిలో తీసుకుంటే నిత్యావసర సరుకుల ధరలలో భారీగా పెరుగుదల కనపడింది. దీనికంతటికీ కారణం 12 సెప్టెంబర్‌తో ముగిసిన వారాంతంలోని ద్రవ్యోల్బణం వృద్ధి జరిగి 0.37 శాతానికి చేరుకుంది. అదే అంతకు మునుపు ముగిసిన వారాంతంలో 0.12 శాతంగా ఉండింది. అదే నిరుడు ఇదే కాలంలోనున్న ద్రవ్యోల్బణం 12.42 శాతంగా ఉండింది. ఐదు సెప్టెంబర్‌తో ముగిసిన వారాంతంలో ద్రవ్యోల్బణం 13 వారాల తర్వాత తొలిసారిగా ద్రవ్యోల్బణం బయటపడింది.

అక్టోబరు : నిత్యావసర సరుకుల ధరలు సాధారణ స్థాయికి చేరుకుని సెప్టెంబరు 26తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం తగ్గి 0.70 శాతానికి చేరుకుంది. అంతకు మునుపు వారంలో ఇది 0.83 శాతంగా ఉండింది. ఆహార ధాన్యాల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం అక్టోబరు 17తో ముగిసిన వారాంతానికి 0.30 శాతం పెరిగి 1.51 శాతానికి చేరుకుంది.

టోకు ధరల ఆధారంగా ద్రవ్యోల్బణం ఇంతకు మునుపు ముగిసిన వారంలో 1.21 శాతంగా ఉండింది. ఇదే కాలంలో తేయాకు, మాంసం, కందులు, బెల్లం, వంట నూనె ధరలు ఎక్కువగానే ఉన్నాయి.
FILE


నవంబరు : నవంబరు నెలలో ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, గోధుమలు, జొన్న, కందుల ధరలు వేగంగా వృద్ధి చెందాయి. దీంతో నిత్యావసర సరుకులు టోకు ధరలలో మార్పులు సంభవించి 31 అక్టోబరుతో ముగిసిన వారాంతంలో అంతకు మునుపు ముగిసిన వారాంతపు ద్రవ్యోల్బణంలో 13.39 శాతం నుంచి పెరిగి 13.68 శాతానికి చేరుకుంది.

డిసెంబరు : ఉల్లిపాయలు, బియ్యం, గోధుమలు తదితర నిత్వావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో ఆహార పదార్థాల టోకు ధరలు ఆధారంగా ద్రవ్యోల్బణం నవంబరు 21తో ముగిసిన వారాంతంలో పెరిగి 17.47 శాతానికి చేరుకుంది. అంతకు మునుపటి వారంలో ధరలు 15.58 శాతంగా ఉన్నాయి.

డిసెంబరు తొలి వారంలో బంగాళా దుంపలు, పప్పు దినుసుల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం రేటు అమాంతం పెరిగి 19.95 శాతానికి చేరుకుంది. అదే అంతకు మనుపు ముగిసిన వారాంతానికి నిత్యావసర సరుకుల టోకు దరలపై ఆధారపడిన ద్రవ్యోల్బణం 19.05 శాతంగా ఉండింది.

మొత్తం మీద 2009 అల్పాదాయ వర్గాల వారికి శాపంలా పరిణమించింది. ప్రభుత్వం అందించిన సబ్సిడీ ఆహార పదార్థాలతోనే వారు కాలం వెళ్ళబుచ్చారనడంలో సందేహం లేదు. వచ్చే సంవత్సరంలోనైనా ధరలు అదుపులో ఉండాలని ఆ భగవంతుడిని వేడుకుందాం.

వెబ్దునియా పై చదవండి