భారతదేశం అలా అంటే చైనాకు రోజుకు రూ.100 కోట్లు నష్టం...

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (21:57 IST)
గ్రామీణ భారతదేశం డిజిటల్ టెక్నాలజీ వినియోగిస్తూ పరుగులు తీస్తోంది. ఒకవైపు వృత్తి పని, మరోవైపు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీపడుతున్నాయి మన గ్రామాలు. ఇరుగు పొరుగు దేశాలతో సమస్యలు తలెత్తితే మాత్రం తుపాకీ గుండు పేల్చకుండా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా కూడా వుంటారు. ఈమధ్య చైనాతో రగడ తెలిసిందే.
 
ఈ నేపధ్యంలో ముంబైలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ‘మేడ్‌ ఇన్‌ చైనా’ పేరుతో ఉన్న ఏ వస్తువునూ కొనకూడదని పిల్లలకు పిలుపునివ్వాలని నిర్ణయించింది. సమావేశం ముగిసిన వెంటనే పాఠశాలలకు చేరుకున్న ప్రాధానోపాధ్యాయులు వెంటనే తమతమ విద్యార్థులకు తాము తీసుకున్న నిర్ణయం గురించి చెప్పారు. ఇక నుంచి చైనా వస్తువులేవీ కొనకూడదని విజ్ఞప్తి చేశారు. ఇది ఆదేశం కాదని.. దేశ శ్రేయస్సు కోసం మనమంతా అమలు చేయాల్సిన నిర్ణయమని, అందుకే విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.
 
చైనాలో ఉత్పత్తి అవుతున్న వస్తువుల్లో ఆ దేశ ప్రజలు వినియోగించుకుంటున్నవి పోగా మిగిలినవాటిలో 80 శాతం వస్తువులు భారత్‌కే ఎగుమతి అవుతున్నాయి. అంతేకాక చైనా కంపెనీలు భారత్‌లోనూ మకాం వేసి, వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. ఫలితంగా వేల కోట్ల రూపాయల మనదేశ సంపదను చైనా చేతుల్లో పెడుతున్నాం. దాదాపు అనధికార లెక్కల ప్రకారమే రోజుకు రూ.100 కోట్ల రూపాయల విలువైన చైనా వస్తువులను భారతీయులు కొంటున్నారట. 
 
ఒకవేళ ఇవి కొనడం మనమంతా మానేస్తే.. అప్పటికప్పుడు చైనా రోజుకు రూ.100 కోట్లు నష్టపోతుంది. ఇది ప్రత్యక్షంగా కనిపించే నష్టం. పరోక్షంగా ఆ దేశంలోని ప్రజలు ఉపాధిని కోల్పోతారు. ఆ దేశం ఆర్థికంగా బలహీన పడుతుంది. చైనాలో తయారయ్యే వస్తువులు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతాయి. చాలా దేశాల్లో చైనా వస్తువులపై నిషేధం అమల్లో ఉంది. పైగా మన దేశమంత పెద్ద మార్కెట్‌ చైనాకు మరొకటి లేదు. మనదేశంలో అమ్మే వస్తువులతోనే చైనా మనుగడ సాగిస్తుందని చెప్పినా అతిశయోక్తి లేదు. 
 
ఇప్పుడు ఆ వస్తువులే అమ్ముడుపోకపోతే.. ఇంతకంటే పెద్ద యుద్ధమేదైనా ఉంటుందా అందుకే మనమంతా ఇప్పుడు ప్రతిజ్ఞ చేయాల్సిన సమయం వచ్చింది. ‘నో టు చైనా ప్రోడక్ట్స్‌’ అని చెప్పే సమయం ఆసన్నమైంది అంటున్నారు మహారాష్ట్ర స్కూళ్ల ఉపాధ్యాయులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు