సంక్రాంతినాడు పితృతర్పణం, దానధర్మాలు చేయండి..!!

FILE
సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్య ఘడియలివి. ఉత్తరాయణ పుణ్యకాల ఆరంభం, దేవమార్గం ప్రారంభమయ్యే రోజునే సంక్రాంతిగా జరుపుకుంటారు. సంక్రాంతి వేళ స్నాన,దాన, జప, వ్రతాదులతో విశేషఫలం. గుమ్మడి, వస్త్రములు దానం చేయడం ఆచారం. పంట చేతికందిన ఈ పర్వం నాడు ప్రతి ఇంటా శోభ వెల్లివిరుస్తుంది. విష్ణు సహస్రనామ పఠనం ఈ రోజున విశేషమైన శుభఫలాలనిస్తుంది.

దేవ, పితృదేవతలనుద్దేశించి చేసే తర్పణాదులు, దానాదులు పుణ్యప్రదం, పౌష్య లక్ష్మిగా జగదంబను ఆరాధించే కాలమిది. స్నాన, దాన, జపాదులు విశేషఫలాన్నిస్తాయి. ఉదయాన్నే స్నానం చేయడం ముఖ్య కర్తవ్యం.

శ్రో || రవి సంక్రమణే ప్రాప్తే నస్నాయా ద్యస్తు మానవః |
సప్త జన్మ సురోగీస్యాత్ నిర్ధనశ్చైవ జాయతే ||
సంక్రాంతి నాడు స్నానం చేయని వానికి రోగాదులు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

శ్లో || సంక్రాన్తేయానిదత్తాని హవ్యకవ్యాని దాతృభిః |
తాని నిత్యం దదాత్యర్క : పునర్జన్మని జన్మని ||
సంక్రాంతినాడు దేవతలకు, పితృదేవతలకు, పాత్రులకు ఏఏ పదార్థాలను దానం చేస్తామో అవి అత్యధికంగా జన్మజన్మలకీ లభిస్తాయి. ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆరంభమిది. పుణ్యకాలంలో తిలలు, బియ్యం కలిపి శివుని పూజించుట, నువ్వుల నూనెతో దీపం వెలిగించుట చాలా శ్రేష్ఠం. నల్లనువ్వులతో పితృతర్పణం చేయాలి. శివునకు ఆవునేతితో అభిషేకం శ్రేష్ఠం. సంక్రాంతి తదుపరి వచ్చే పర్వదినాలు పశుపూజకి వినియోగిస్తారు. శ్రమకీ, సంపదకీ ఆరాధ్యస్థాన మిచ్చిన పండుగ ఇది.

సంక్రమణం నాడు ఒంటిపూజ భోజనం చేయాలి. రాత్రి భుజింపరాదు. దేవ, పితృపూజలకు దివ్యమైన కాలమిది. మంత్రజపాదులు, ధ్యానం పారాయణం శ్రేష్ఠఫలాలను శ్రీఘ్రంగా ప్రసాదించే కాలమహిమ సంక్రమణానికి ఉంది.

యాయా స్సన్నిహితా నాడ్య : తాస్తా : పుణ్యతమా : స్మృతా : || అని ధర్మశాస్త్రం. సంక్రాంతి సమీపిస్తున్న కొలది అధికమైన పుణ్య ఘడియలు అన్నారు. పంచ రుణాల నుంచి గృహస్థుల విముక్తి పొందే మార్గాలను ఆచారా రూపంలో నిక్షేపించి, నిర్దేశించిందీ మకర సంక్రాంతి.

FILE
దేవ రుణం: త్రిమూర్తి స్వరూపుడైన సూర్యనారాయణ భగవానుణ్ని ప్రపంచ పోషకుడిగా, వేడి-వెలుతురు-ఆరోగ్యం ప్రసాదించే వాడిగా, జ్ఞాన భాస్కరుడిగా, యుద్ధాధిపతిగా భారతీయులు అనాదిగా ఆరాధిస్తున్నారు. ఇంద్ర, వరుణ, వాయుదేవతల సహాయంతో సూర్యుడు భూమిపై వర్షించడంవలనే మకర సంక్రాంతి పండుగనాటికి పంటలు పండి మన చేతికి అందుతాయి.

సంక్రాంతినాడు తలంటుస్నానం చేసి, సూర్యాది దేవతలను పూజించి కొత్తబియ్యంతో పొంగులు వారే పొంగలి, పులగం తయారుచేసి, పాలను పొంగించి సూర్యభగవానుడికి భక్తితో కృతజ్ఞతలతో నివేదించడం ఆచారం.

పితృణం: పితృతర్పణాలు, పిండోదకదానాలు, శ్రాద్ధకర్మలు మొదలైనవి ఆచరించడం ద్వారా మరణించిన పితరుల రుణం కొంతైనా తీరుతుందని విశ్వసిస్తారు. మకర సంక్రాంతి నాడు తెలకపిండిని ఒంటికి రాసుకుని స్నానం చేయడం ఆచారం. ఎందుకంటే.. మకరరాశికి శని అధిపతి. శని వాత ప్రధాన గ్రహమంటారు.

వాతం తగ్గాలంటే సంక్రాంతినాడు తెలకపిండితో స్నానం చేసి, నువ్వులు-బెల్లం-గుమ్మడికాయ మొదలైన దానాలు ఇవ్వడమే ఇందుకు పరిహారం అని చెబుతుంటారు. నువ్వులు, బెల్లంతో చేసిన అరిసెలు మొదలైనవి తింటారు. భూతరుణం: భూమి, నీరు, గాలి మొదలైన భూతాలు కరుణించడం వల్లనే పంటలు పండుతున్నాయి. అందుకే కృతజ్ఞతతో వాటిని కూడా పూజిస్తాం.

మనుష్య రుణం: ఇతరుల సహాయ సహకారాలు లేనిదే సమాజంలో జీవనం కొనసాగించలేం. అందుకు కృతజ్ఞతగా ఈ పండుగనాడు ధాన్యం, తిలలు, కర్రలు, చెరకు, గోవులు, పళ్లు వస్త్రాలు మొదలైనవి విరివిగా దానధర్మాలు చేస్తారు. అతిథులను ఆదరిస్తారు. వ్యవసాయములో సహాయం చేసినవారికి, గ్రామంలోని ఇతర వృత్తుల వారికి కొత్త ధాన్యాన్ని పంచి పెట్టడం కూడా ఈ పండుగలోని మరో ఆచారం.

వెబ్దునియా పై చదవండి