అధికారంకోసం అభివృద్ధికి బ్రేకులా?

బుధవారం, 1 అక్టోబరు 2008 (15:28 IST)
FileFILE
వార్త : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మంగళవారం సమావేశమైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సింగూర్ వివాదం నేపథ్యంలో బెంగాల్‌లో 355సెక్షన్ విధించాలని డిమాండ్ చేశారు.

చెవాకు : మమత గారూ, మీరు ఎపుడు ఎవరితో కలుస్తారో, ఎపుడు విడిపోతారో మీకే తెలియదు. కేవలం కమ్యూనిస్టుల కోటలో పాగా వేయాలనుకునే దిశగా మీరు అడుగులు వేయడం మంచిదే. కానీ దానికోసం రాష్ట్రాభివృద్ధికి వస్తున్న అవకాశాలను తలదన్నడం ఏమంత బాగోలేదు.

టాటా ప్రాజెక్టును వ్యతిరేకించడం ద్వారా స్థానికుల అండతో తాత్కాలిక లాభం చేకూరవచ్చునేమో కానీ పరిశ్రమ వర్గాలు మాత్రం మండి పడుతున్నాయి. స్థానికుల వ్యతిరేకత సైతం ఓట్ల రూపంలో కన్పించగలదా అనే విషయం వేచి చూస్తే కానీ తెలియదు.

పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా వ్యవహరించే కమ్యూనిస్టు ప్రభుత్వం ఇంత పెద్ద ఫ్యాక్టరీని రాష్ట్రంలోకి అనుమతించడమే పెద్ద విషయమైతే, దానిని ఆ రాష్ట్రానికి దూరం చేయడం ద్వారా మీరు కూడా ప్రజాగ్రహానికి గురవ్వాల్సి వస్తుందేమో.

ఇలాంటి ఉద్యమాలకన్నా ఓ స్థిరమైన రాజకీయ వైఖరితో ముందుకు సాగితే ప్రజలు ప్రస్తుత ప్రభుత్వాన్ని వద్దనుకున్న రోజు మీకూ అవకాశం రావచ్చు. ప్రస్తుతం మీరు అవలంబిస్తున్న రాజకీయ ప్రయోజన ఉద్యమాలతో అందరి ఆగ్రహాన్ని చవి చూడాల్సి ఉండొచ్చేమో.

వెబ్దునియా పై చదవండి